TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ, వైసీపీ గెలవాలని రాసిపెట్టారా?.. మేమే గెలుస్తాం

Published on: Sat May 11, 2019 2:49PM

 

ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందంటే.. కొందరు వైసీపీ అని, కొందరు టీడీపీ అని చెబుతున్నారు. జనసేన పేరు మాత్రం దాదాపు ఎవరూ చెప్పట్లేదు. అయితే నాగబాబు మాత్రం.. టీడీపీ, వైసీపీలే అధికారంలోకి రావాలా? తాము రాకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా నాగబాబు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మేం గెలుస్తామని నమ్మకం ఉంది. 90 సీట్లు రావొచ్చు మాకు. ఎందుకు రాకూడదు. ఏం ఓన్లీ జగన్ గారికే వస్తాయా? చంద్రబాబు గారికే వస్తాయా? వాళ్లు మాత్రమే రాసిపెట్టుకున్నారా? మాకు 150 సీట్లు కూడా రావొచ్చేమో?’ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

అయితే మిగతా రాజకీయ పార్టీల్లా ‘మాకు ఇన్నిసీట్లు వస్తాయి.. అన్ని సీట్లు వస్తాయ’ అని చెప్పబోమని నాగబాబు అన్నారు. ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారనీ, దానిపై మాట్లాడటం అనవసరమని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? లేక ప్రభుత్వంలో భాగస్వామి అవుతామా? అనేంత దూరం తాము ఇంకా ఆలోచించలేదన్నారు.

‘మేం రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాం. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్, మేము వచ్చాం. కాబట్టి అందులో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ గురించి అస్సలు ఆలోచించం. మాది 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కాబట్టి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? రాకుంటే కింగ్ మేకర్ అవుతామా? అన్న ఆలోచనే మాకు లేదు. మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం’ అని నాగబాబు స్పష్టం చేశారు.