పొత్తు ధర్మం తెలుగుదేశం పాటిస్తే సరిపోతుందా: పవన్ మౌనం వెనుక సంకేతమేంటి.?
Published on: Thu Oct 22, 2026 4:50PM

ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరాన్ని జనసేన విస్మరించిందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరైనా ఔనన్న సమాధానమే ఇస్తారు. స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దు పాట్లు సజావుగా జరిగాయని కూటమి పార్టీల అగ్రనేతలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జన సేన పార్టీల నుంచి రెబల్స్ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... తెలుగుదశం రెబల్స్ కు చంద్రబాబునాయుడు అల్టిమేటం జారీ చేశారు. స్థానక ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని విస్పష్ట సందేశం పంపారు. నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే సస్పెన్షన్ తప్పదన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తు ధర్మానికి అనుగుణంగా చంద్రబాబు విస్పష్ట నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు, శ్రేణులకు అందుకు అనుగుణంగా హెచ్చరికలు జారీ చేశారు.

అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తమ పార్టీ రెబల్స్ విషయంలో మౌనం వహించారు. ఇంత వరకూ ఆ పార్టీ రెబల్స్ కు ఎటువంటి హెచ్చరికా జారీ చేయలేదు. ఇది అలుసుగా తీసుకుని జనసైనికులు, ఆ పార్టీ నేతలు లక్ష్మణ రేఖ దాటి తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 30% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ ఈ వివాదాన్ని తీవ్రతరం చేశారు. అక్టోబర్ 21న ఆయన తమ 30శాతం సీట్ల డిమాండ్ పై స్పందించేందుకు తెలుగుదేశం పార్టీకి మూడు గంటల టైమ్ లైన్ విధించారు. ఆ గడువులోగా తమ డిమాండ్ కు అంగీకరించకుంటే.. స్థానిక పోరులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయానికి వెనుకాడబోమని అల్టిమేటమ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, తిరుగుబాటు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను ఆదేశించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జనసేన, బీజేపీలతో పొత్తు ఒప్పందాన్ని గౌరవించాలని మిత్రధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. పొత్త ధర్మంలో భాగంగా సీట్లు దక్కని వారిని నామినేటెడ్ పదవులకు పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు.
అయితే జనసేన నుంచి మాత్రం ఇంత వరకూ అలాంటి ప్రకటన ఏదీ వెలువడలేదు. రెబల్స్ ను రంగం నుంచి తప్పుకోవాలన్న హెచ్చరిక, సూచన పవన్ నుంచి రాలేదు. బోలిసెట్టి వంటి వారి నోటి దురుసు ప్రకటనను ఖండించలేదు. అందుకే పవన్ మౌనం పొత్తు ధర్మం విషయంలో జనసేన చిత్తశుద్ధిపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది.
[Janasena TDP Seat Sharing, Pawan Kalyan Silence, AP Local Body Elections, NDA Alliance Andhra Pradesh, TDP and Janasena Dissent, Telugu One]


