జగన్ 100 రోజుల పాలన.. పవన్ కి అస్సలు నచ్చలేదు

 

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు.

‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
 
‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు.

రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు.

‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.