బాత్రూమ్ లో హత్య చేసిన వారిని వదిలి.. నన్ను అరెస్ట్ చేస్తారా: రాపాక

 

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కి ముందు సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు. వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

"మంత్రి కనుసన్నల్లో అక్రమ కేసులు. అధికారం అడ్డం పెట్టుకుని అణిచివేతకు గురి చేసే ప్రయత్నం" అని రాపాక విమర్శించారు. 

"మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా ప్రవర్తించి , ప్రజల పక్షాన నిలబడ్డా.. చట్టం ముందు అందరూ సమానమే బాత్రూమ్ లో జరిగిన హత్య కేసులో కూడా తప్పు చేసినవారికి శిక్షలు వేయండి." అని సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసారు.

"గతంలో మలికిపురంలో పోలీసుస్టేషన్ అద్దె భవనంలో ఉంటే స్థలం సమకూర్చి స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిధులు తీసుకువచ్చి పోలీసుస్టేషన్ కట్టించి అప్పటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా ఓపెనింగ్ చేయించా" అని చెప్పుకొచ్చారు.

"ప్రభుత్వ ఆస్తులు ధ్వసం చేశారని,  పోలీసుస్టేషన్ పై రాళ్లు రువ్వారని వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య నిందారోపణలు ఆధారంగా చేసుకుని ఒక దళిత ఎమ్మెల్యే ఐన నా మీద జనసైనికుల మీద ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం వైసీపీ వారి కుట్రలో ఒక భాగం." అని మండిపడ్డారు.

"అధికార ప్రభుత్వం తమదే అని నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్న వైసీపీ వారిని వదిలి.. ఒక కిడ్నీ డయాలిసిస్ పేషెంట్ ని విడిచిపెట్టమని కోరినందుకు కాల్చి పారేస్తా అని అన్న మలికిపురం SI మీద చర్యలు తీసుకోకుండా న్యాయం కోరి ధర్నా చేసిన వారిపై కక్షపూరితంగా కేసులు పెడతారా" అని రాపాక నిలదీశారు.