తిరుపతిలో జనసేన ఒంటరి పోరు? బీజేపీ నేతల తీరుపై పవన్ గుర్రు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్ సభ చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ఎంపీ అకాల మరణంలో ఖాళీ అయిన ఎంపీ సీటుకు త్వరలోనే ఎన్నిక జరగనుంది.  నోటిఫికేష‌న్ ఏ క్ష‌ణ‌మైన విడుద‌లయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్ని ఉప ఎన్నిక వ్యూహరచనలో ఉన్నాయి. తిరుపతి ఎన్నికను సవాల్ గా తీసుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం కూడే చేసేస్తోంది. గత ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన అధికార వైసీపీ ఇంకా క్యాండిడేట్ ను ఖరారు చేయలేదు. ఇక ఏపీలో బలపడేందుకు పావులు కదుపుతున్న బీజేపీ.. జనసేనతో కలిసి తిరుపతిలో సత్తా చాటాలని చూస్తోంది. అయితే తిరుపతిలో పోటీ అంశంలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య క్లారిటీ రావడం లేదు. ఎవరూ బరిలో ఉండాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఆ రెండు పార్టీల నేతలతో పాటు కేడర్ లోనూ గందరగోళం నెలకొంది. ఇరు పార్టీల నేతలు ఇస్తున్న భిన్న ప్రకటనలతో.. తిరుపతి ఉప ఎన్నికలో  ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేక ఎవరికి వారే పోటీ చేస్తారా అన్న  అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

 తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో  జనసేన నుంచి అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మొదటి నుంచి భావిస్తున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీ కంటే జనసేననే బలంగా ఉందని ఆ పార్టీ లెక్కలు చెబుతోంది. జ‌న‌సేన అభ్య‌ర్ధినే ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించాల‌ని ఢిల్లీ వెళ్లి మ‌రి  బీజేపీ పెద్ద‌లకు విజ్ఞ‌ప్తి చేసుకున్నారు ప‌వ‌న్ . తిరుపతిలో తమకు  అవకాశం ఇవ్వాలనే షరతుతోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిందనే ప్రచారం కూడా జరిగింది.  అయితే తాజాగా కొంత‌మంది ఏపీ బిజేపీ నాయకులు చేస్తోన్న కామెంట్స్ తో తిరుపతి అభ్యర్థిపై క్లారిటీ రావడం లేదు. బీజేపీనే తిరుపతిలో పోటీ చేస్తుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపై  ప‌వ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.  ఇప్పటికి బ‌రిలో ఉండ‌బోయే అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం పై ఆ పార్టీ నేత‌లు కూడా గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. 

తిరుపతి పోటీ విషయంలో బీజేపీ నాన్చుడు దోరణిపై జనసేన చీఫ్ అసహనంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ తీరుతో తిరుపతిలో  పోటీపై అయోమయం కనిపిస్తుండటంతో గబ్బర్ సింగ్ కూడా ఒక విధ‌మైన క‌న్ఫ్యూజన్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా వెళ్లి కోరిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డ‌మేంట‌ని బీజేపీ హైకమాండ్ పైనా ప‌వ‌న్ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. తిరుపతి  అభ్య‌ర్దిని ఎన్నుకోవ‌డానికి గ‌తంలో రెండు పార్టీల సభ్యులతో ఒక క‌మిటిని వేశారు. అయితే ఈ క‌మిటి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారిగా స‌మావేశం కాలేదు.  బీజేపీ చివరి వరకు నాన్చేందుకే ఇలా చేస్తుందన్న అనుమానాలను కొందరు జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు.  అందుకే చివ‌రి వ‌ర‌కు నాన్చి బీజేపీ హ్యాండిస్తే.. ఏం చేయాల‌న్నదానిపై జ‌న‌సేన శ్రేణులు క‌స‌రత్తు చేస్తోన్నాయని తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీ కంటే తామే బలంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తామే పోటీ చేస్తామని తేల్చి చెబుతోంది జనసేన. బీజేపీ తమకు సహకరించకపోతే  ఈనెల 21న తిరుపతిలో నిర్వహించనున్న సమావేశంలో పవన్ కల్యాణ్ సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు బీజేపీ విషయంలో జనసేన నేతల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు కాపు సామాజిక వర్గంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఉన్నారు. తటస్ట కాపు నేతలతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన పార్టీలో చేరితే కాపు వర్గం మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. అందులో భాగంగానే సోము వీర్రాజు స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారని... రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీలో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ముద్రగడతో పాటు మరికొందరు కాపు నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. 

అయితే కాపు సామాజిక వర్గానికి దగ్గరవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం జనసేనకు భారీ నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గమే ఎక్కువగా జనసేనకు మద్దతుగా ఉంటోంది. ఇప్పుడు బీజేపీ రాజకీయ వ్యూహాలతో .. ఆ పార్టీ తమ ఓటు బ్యాంక్ కే గండి కొడుతుందనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికతో పాటు ఏపీ బీజేపీ రాజకీయ నిర్ణయాలతో తమకు మంచి కంటే చెడే జరుగుతుందన్న అభిప్రాయమే మెజార్టీ జనసేన నాయకుల్లో ఉందని తెలుస్తోంది. ఇది బీజేపీ, జనసేన పొత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.