షాకింగ్.. వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. రెండ్రోజుల కింద పారిశుధ్య సమస్యలపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును బండ్ల వెంగయ్యనాయుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా?.. నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి?’’ అంటూ అందరి ఎదుట అతనిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన వెంగయ్య నాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని ప్రశ్నించారు. వైసీపీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. గ్రామంలో పారశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా?.. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే  రాంబాబు ఉన్నారా?.. అని నిలదీశారు. 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా? అని విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన యువకుణ్ణి  ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందిందన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని పవన్ డిమాండ్ చేశారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జనసేనాని భరోసా ఇచ్చారు.