జేఎఫ్‌సీని జనసేనకు వాడుకుంటాడా..?

ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.

 

పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.

 

రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.