పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా?

 

మైనింగ్ మాఫియాకి పర్యాయపదం లాంటి వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన్ని పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి జనార్ధన్ రెడ్డి కోటి లంచం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఈ డీల్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో  లేకుండా పోయినట్టుగా పోలీసులు గుర్తించారు.

జనార్దన్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాలు నిర్వహించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. జనార్ధన్ రెడ్డి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైద్రాబాద్, బెంగుళూరు, ఢిల్లీలో జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. జనార్ధన్ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకు గాలి జనార్ధన్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన హైద్రాబాద్ లో ఉండి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం దేశం వదిలి వెళ్ళిపోయుంటాడని అభిప్రాయపడుతున్నారు.

గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా జనాలకి ఎలా తెలుసో బీజేపీ నేతగా కూడా అలానే తెలుసు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం వల్ల పార్టీకి మచ్చ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ.. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు తప్ప మిగిలిన విషయాలు తనకు తెలీదని, మాతో ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదని యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, అందువలన ఈ విషయంపై పూర్తి వివరాలు తాము సేకరించలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. మరో బీజేపీ నేత, గాలి ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములు కూడా ఇంచుమించు ఇలాగే స్పందించారు. ఈ విషయం గురించి తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాతే తెలుసుకున్నానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతల స్పందనతో గాలి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో గాలి జనార్ధన్ రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేసారు. ఇప్పటికి బళ్లారిలో గాలి కుటుంబానికి మంచి పట్టుంది. ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థికంగా తోడుంటారని అంటుంటారు. ఎన్నికల సమయంలో బీజేపీ వ్యక్తి అయిన గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటకలో ఎన్నికలు, ఉప ఎన్నికలు అయిపోయి.. ఇలా కేసులో దొరికిపోయి పారిపోతే పార్టీకి మచ్చ వస్తుందని.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా? అంటూ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం చెప్పినదాని ప్రకారమే కర్ణాటక బీజేపీ నేతలు గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఇలా స్పందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.