జన నాయకుడు విజయ్.. కింగ్ మేకర్ కాదు కింగే!
Published on: Mon May 4, 2026 11:27AM

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన దళపతి విజయ్ కు తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమిళనాడు రాజకీయాలలో దళపతి విజయ్ కింగ్ మేకర్ కాగలరని.. ఆయన కనీసం 20 సీట్లు గెలుచుకుంటారని.. హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే మొండుగా ఉన్నాయి. పొత్తులు, రాజకీయ ఎత్తుగడలకు సంబంధించిన ఏం జరుగుతుందనేది పక్కన పెడితే..
సాధారణంగా తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టే హీరోలు ఏదో ఒక జాతీయ పార్టీ అండ కోసం చూస్తుంటారు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగారు. బీజేపీ ఆయనతో పొత్తు కోసం ఎన్నికలకు మందు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. గత కొంతకాలంగా విజయ్ పార్టీకి బిజెపి తెరవెనుక మద్దతు ఇస్తోందని వస్తున్న వార్తలను కొట్టిపారేసి ఒంటరిగా బరిలో నిలిచారు. ఇప్పుడు ఆయన బీజేపీ అవసరం, మద్దతు లేకుండానే తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయి విజయాన్ని అందుకున్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా, పక్కాగా ప్రజా సమస్యలనే ఎజెండాగా మార్చుకుని రంగంలోకి దిగి విజయ్ సత్ఫలితాలు సాధించారు.


