నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానంటున్న ఎమ్మెల్యే! 

రాజకీయ నేతలు సవాల్ విసురుకోవడం కామన్. కొందరు నేతలు శపథాలు చేస్తుంటారు... ఇంకొందరు గుళ్లలో ప్రమాణాలు  చేస్తుంటారు. కాని ఈ ఎమ్మెల్యే మాత్రం స్పెషల్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో   ఉంటారు. వినూత్నంగా  వ్యవహరిస్తుంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అధికారులపైనా నిరసన తెలుపుతుంటారు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా వెరైటీ కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆ ఎమ్మెల్యేనే మరోసారి సంచలన సవాల్ చేశారు. 

ఆయనెవరో కాదు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆయన వార్నింగ్ ఇచ్చారు.  తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన 1లక్షా30వేల కోట్ల నిధులు ఇవ్వకుండా దగా చేస్తుందని మండిపడ్డారు ముత్తిరెడ్డి. ఇది వాస్తవం కాదని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే జనగామ నియోజకవర్గంలో నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానని సవాల్ చేశారు. ముత్తిరెడ్డి చేసిన సవాల్ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది. 

గతంలోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు  వివాదాల్లో  చిక్కుకున్నారు.  ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో ఆయన వెంచర్ వేశారు. మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసి మురుగు నీటిని యశ్వంతాపుర్ వాగులోకి తరలించే యత్నం చేశారని స్థానికుల ఆరోపణ. దీన్ని టీఆర్‌ఎస్‌‌కు చెందిన మాజీ సర్పంచ్ సుశీలమ్మ అడ్డుకున్నారు. ఆమె అడ్డుకోవడంతో నేలపై పడుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సరికాదని ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. 

చేర్యాలలో మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి నుంచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కుమార్తె కొన్న స్థలం మొత్తం కాలువకు వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త పక్కకు జరిపి కేవలం 1000 గజాల స్థలం మాత్రమే కోల్పోయేలా కాలువను ముత్తిరెడ్డి డిజైన్‌ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని తాను కబ్జా చేశానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నిరూపిస్తే జనగామలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ముత్తిరెడ్డి సవాల్‌ విసిరారు.