TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖ్యమంత్రిగా జానా ? పిసిసి అధ్యక్షుడిగా కన్నా ?

Published on: Mon Aug 13, 2012 11:27PM

రత్నగిరికి కేటాయించిన గ్యాసును ప్రధానమంత్రితో మాట్లాడి మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వెనక్కి తీసుకురావడం తన పనితనంగా చెప్పు కొస్తున్నారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకోసం కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని అసమర్దునిగా, ఎంపిలను రాష్ట్రానికి ఏమీ చెయ్యని వారిగా చిత్రీకరిస్తున్నారని జైపాల్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. నిజానికి 11 నెలల ముందుగానే జైపాల్‌రెడ్డి రత్నగిరికి గ్యాసు వెళుతున్నదన్న విషయాన్ని లీకు చేసి ప్రధాన మంత్రితో మాట్లాడాలని చెప్పి, 11 నెలల పాటు అడ్డుకున్నా దానికి కృతజ్ఞత తెలుపకుండా అభాండాలు వేస్తున్నారని వారు ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడిది చిలికి చిలికి గాలివానగా మారింది. అసలే గవర్నర్‌కు ముఖ్యమంత్రికి సయోధ్య అంతంత మాత్రమే. దీనికి తోడు జైపాల్‌రెడ్డితో గొడవ. శనివారం జైపాల్‌రెడ్డితో గవర్నర్‌ భేటీ.. .ఆదివారం వాయిలార్‌రవి రాష్ట్రానికి రాకతో కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నీయాంశమైంది. ఆగస్టు 15 తర్వాత పిసిసి అద్యక్షుడు, ముఖ్యమంత్రి మారతారని పార్టీలో జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు గవర్నర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాం నబీఆజాద్‌ను కలవడం కీలకంగా మారింది. మంత్రులతో కిరణ్‌కుమార్‌రెడ్డికి సమన్యయం లేదని, సీఎం కార్యాలయ పని తీరు కూడా బాగోలేదని దీనివల్ల ప్రజలకు చెడుసంకేతాలు అందుతున్నాయంటూ గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జ్‌ ఆజాద్‌ కి చెప్పినట్లు తెలుసింది.

 

2014 లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉండాలంటే కిరణ్‌కుమార్‌ని మార్చాల్సిందే అని కూడా తెలియచేశారు. దీంతో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా జానారెడ్డి, పిసిసి ప్రసిడెంటుగా కోస్తాకు చెందిన వ్యక్తిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. జానారెడ్డికి రాయలసీమ, కోస్తాంద్రవారితో సత్‌ సంబందాలన్నాయని జైపాల్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయని తెలిసింది. తెలంగాణ నుండి మాజీ పిసిసి చీఫ్‌ డి శ్రీనివాస్‌కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి కూడా చాపక్రింది నీరులా తన ప్రయత్నాలు చేస్తున్నారు. శశిధర్‌ రెడ్డికి గులాంనబీ ఆజాద్‌ ఆశీస్సులున్నాయంటున్నారు. పిసిసి ప్రసిడెంట్‌ బొత్స తన ప్రయత్నాలతో వారంలో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే బొత్స మంత్రులకు మద్య చిచ్చుపెడుతున్నారని, ఏడుగురు మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బొత్స స్ధానంలో మంత్రి కన్నాలక్ష్మీనారాయణను నియమిస్తారంటున్నారు.ఆయనకు చిరంజీవితో పాటు సీమాంద్రకు చెందిన పలువురు ఎంపీలు కూడా మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులు, రెడ్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ లో ఉంటున్నారని అలాగే బిసిలంతా తెలుగుదేశం వైపు ఆకర్షితులవుతున్నారని, కోస్తాలో బలమైన వర్గం కాపులు, రాయలసీమలో బలిజలు కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలంటే కాపు వర్గానికే పిసిసి పదవివ్వడం సరైన నిర్ణయమంటున్నారు.