జమ్ము కాశ్మీర్‌లో వరద బీభత్సం... 100 మంది...
Published on: Sat Sep 6, 2014 5:26PM

జమ్ము కాశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు జీలం నది పొంగి ప్రవహిస్తూ వుండటంతో రాష్ట్రమంతా వరదలతో అల్లకల్లోలమైపోతోంది. ఈ వరదల్లో ఇప్పటి వరకు మొత్తం వందమందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరదల కారణంగా రోడ్డు నానిపోవడంతో పెళ్ళి బృందంతో వెళ్తున్న ఒక బస్సు నీటిలో పడిపోయి 40 మంది మరణించారు. అలాగే పుల్వామాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి వెళ్ళిన ఎనిమిది మంది సైనికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే పుల్వామాలోని అవంతీపూర్ వర్సిటీ హాస్టల్‌లో వరద నీటిలో వందమంది విద్యార్థులు చిక్కుకుపోయారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో 15 అడుగుల మేరకు వరద నీరు నిలిచింది. నీటిలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.


