TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పహల్గామ్ ఉగ్రదాడి కేసు..ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు

Published on: Sun Apr 27, 2025 11:45AM

 

 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్‌లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సుందరమైన పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

సంఘటన జరిగిన తీరును, ఉగ్రవాదుల కదలికలను కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి, వారి మతాన్ని అడిగి తెలుసుకుని, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారని తెలిసింది. మృతుల్లో 25 మంది హిందూ పురుషులు ఉన్నారు. ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో లభించే ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ దారుణ మారణకాండ వెనుక ఉన్న ఉగ్ర కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. భారత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహ్మద్ (జేఈఎం) సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి.