TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా

Published on: Wed Apr 23, 2025 2:48PM

 

 

జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి హోం శాఖ మంత్రి  భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.

 

కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్‌ మార్చినట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ లతో భేటీయై ఉగ్రదాడిపై చర్చించారు. భద్రతా చర్యలపై ఆరాతీశారు. మరోవైపు, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కూడా నేడు భేటీ కానుంది.ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) సభ్యులే పహల్గామ్‌లోని బైసారన్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన‌ట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపిన‌ట్లు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూ సర్కార్.