ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్టు.. ఎందుకంటే?
Published on: Sat Aug 8, 2026 2:37PM

కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైపీపీ చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిరసన లో పాల్గొనేందుకు విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరమ్మతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలపై వైసీపీ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో చేపట్టిన నిరసన దీక్షలు శనివారం (ఆగస్టు 8) మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ దీక్షలకు అనుమతులు లేకపోవడంతో పోలీసులు నిరసనను విరమించుకోవాలని నోటీసులు జారీ చేసింది.
అయితే ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ వైసీపీ నిరసన దీక్ష కొనసాగించేందుకే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. అనంతరం ముందస్తు జాగ్రత్త చర్యగా పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైసీపీ విమర్శించింది.
Jammalamadugu Tension, YCP MLC, Ramasubba Reddy Arrested, Kadapa News, DSC Recruitment Protest, TeluguOne


