అక్కడ పందెం... ఇక్కడ పంతం!

మామూలుగా తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేయటం మనం చూస్తుంటాం! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తమిళ ఉద్యమం కూడా మన నేటివిటికీ తగ్గట్టు రీమేక్ అవుతున్నట్టు కనిపిస్తోంది! అక్కడ చెన్నై. ఇక్కడ వైజాగ్. అక్కడ మెరీనా బీచ్. ఇక్కడ ఆర్కే బీచ్. అక్కడ యూత్. ఇక్కడా యూతే. ఇక ఒకే ఒక్క డిఫరెన్స్... అక్కడ జల్లికట్టు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పట్టు! మిగతాదంతా సేమ్ టూ సేమ్!


ఆంధ్రా జనం సీరియస్ గా తీసుకుని ప్రత్యేక హోదా కావాలంటుంటే తమిళ రీమేక్ సినిమాతో పోల్చటం ఏంటని ఎవరికైనా కోపం రావచ్చు. అయితే ఇక్కడ ఉద్దేశం ఉద్యమాన్ని వెటకారం చేయటం కాదు. కాని, ఉద్యమం ఆచరణ విషయంలోనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో అలా అలా పుట్టిన పిలుపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు కార్యరూపం దాల్చనుంది. మరి గణతంత్ర ఉద్యమానికి రణతంత్రం నడిపేది ఎవరు? ఎవరు లేకుండా స్వచ్ఛందంగా నిరసనలు జరగడం అంత తేలికేనా? తమిళనాడులో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా చర్చ జరగకుండానే సైలెంట్ గా ముంచుకొచ్చేసింది సునామీ. అందుకే, ప్రభుత్వం అలెర్ట్ అవ్వలేకపోయింది. సంక్రాంతి పూర్తికాగానే తమిళ జనం ఒక్క పెట్టున మెరీనా బీచ్ ని ముంచేశారు. కాని, ఇప్పుడు ఆంద్రాలో పరిస్థితి అలా లేదు. జనవరి 26న జనం పొటెత్తపోతున్నారని గవర్నెమంట్ కి తెలిసిపోయింది. కంట్రోల్ చేసే ఏర్పాట్లు చేసుకోకుండా వుంటుందా? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రాలోని టీడీపీ గవర్నెమెంట్ పై తగిన ఒత్తిడి తేకుండా వుంటుందా?


ఇటు జనం హోదా కోసం పట్టుబడితే, అటు సర్కార్ వాళ్లని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తే సంఘర్షణ తప్పదు. ఇప్పుడు చెన్నైలో చెలరేగుతున్న హింస లాంటిదే వైజాగ్ లోనూ మనం చూడాల్సి రావచ్చు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదని భరోసా ఎవరు ఇస్తారు? వచ్చిన యువతని నియంత్రించే నాయకులు ఎవరు? ట్విట్టర్ లో మద్దతు పలుకుతున్న పవన్ కళ్యాణ్ సహా తెలుగు హీరోలందరూ ఏ మేర ఉద్యమంలో పాల్గొంటారు? వారు చెప్పినా రోడ్లపైకి వచ్చిన జనం అసలు వింటారా? తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాగే ఉద్యమం మొదలై చివరకు ట్యాంక్ బండ్ పై విగ్రహాలు నేలకూలటం మనం చూశాం. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా శాంతియుతంగా ప్రత్యేక హోదా ఉద్యమం జరగాలి. అప్పుడే కేంద్రంపై సరైన ఒత్తిడి పని చేస్తుంది. లేదంటే హింసాత్మక సంఘటనలు కారణంగా చూపి అణిచివేసే అవకాశాలే ఎక్కువ.


ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఆంధ్రా జనం మరో కోణం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం నక్సల్స్ పని అయ్యి వుండవచ్చని అనుమానిస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున్న వైజాగ్ బీచ్ లో జనం చేరితే అక్కడికి సంఘ విద్రోహ శక్తులు చేరుకోవని గ్యారెంటీ ఏంటి? అసలు ఇలాంటి సాధ్యాసాధ్యాలు కాకుండా మూలానికి వెళితే... ఒక్క ప్రశ్న మనకు బలంగా ఎదురవుతుంది. జల్లికట్టు తమిళులకు భావోద్వేగాలకు సంబంధించిన సాంస్కృతిక అంశం. అందుకే, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారా సుప్రీమ్ తీర్పును పక్కకు పెట్టే ప్రయత్నాలు చేశాయి. కాని, ప్రత్యేక హోదా పూర్తిగా ఆర్దిక అంశం. ఇక పై దేశంలోని ఏ రాష్ట్రానికీ హోదా వుండదని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయాక ఢిల్లీ ప్రభుత్వం దిగి వస్తుందా? దీనిపై ఉద్యమకారులు లోతుగా ఆలోచించుకుని ముందుకు కదలాలి. ఎందుకంటే, రానున్నది విద్యార్థులకి అమూల్యమైన పరీక్షల కాలం. ఆ సమయంలో ఎంతో కష్ట సాధ్యమైన హోదా అంశాన్ని నెత్తికెత్తుకొని యువతని, విద్యార్థుల్ని రోడ్లపైకి తేవటం అనేక విధాల నష్టదాయకమే...