ఇదే పరిస్థితి నీ కూతురికి వస్తే ఏం చేస్తావ్ కేసీఆర్

 

కొడంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి.  హైదరాబాద్‌లో గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయం అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తుంటే నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారని... కానీ, సీఎం కేసీఆర్ సభ దృష్ట్యా బంద్ విరమించుకుని, కోస్గి బయట నిరసన చేపట్టాలని నిర్ణయించినా అరెస్టులు ఎందుకు చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి బెడ్‌రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్ట్‌లు చేయడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి జరిగితే...ఎలా ఉంటుందో కేసీఆర్‌ ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్‌ను జైపాల్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయొచ్చు కదా అని నిలదీశారు. ప్రభుత్వానికి తొత్తులుగా ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జగ్గారెడ్డి, వంటేరులాంటి నేతలకు స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.