TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైళ్లోనూ అదే దర్జా.. అదే దర్పం, అదే దౌర్జన్యం!

Published on: Sat Jun 4, 2022 8:16AM

వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చన్నా ఫరవాలేదు అంటారు. అలాగే అధికార పార్టీ వ్యక్తి అయితే చాలు జైల్లో ఉన్నా రాచమర్యాదలు అందుతాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు  రాచ మర్యాదలు లభిస్తున్నాయి. నిబంధనలకు తిలొదకాలు వదిలేసి మరీ జైలు అధికారులు అనంతబాబు సేవలో తరిస్తున్నారు. ఇంతకీ అనంతబాబు గుర్తున్నాడు కదా!

అధికార వైసీపీ ఎమ్మెల్సీ. తన మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీ. తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన కారులోనే అతడి ఇంటికి రోడ్ డెలివరీ ఇచ్చాడు. ఆ తరువాత తీరిగ్గా పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అనివార్య పరిస్థితుల్లో నేరం అంగీకరించినా పోలీసులు మాత్రం అనంత బాబును అరెస్టుకు ముందు, తరువాతా, ఇప్పుడు సెంట్రల్ జైలులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్( వీవీఐపీ) ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా. అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో మొక్కుబడిగా పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేసినట్లు చేశారు. కానీ రాజమహేంద్రవరం జైలులో అనంతబాబును ‘జాగ్రత్త’గా చూసుకోవాలంటూ పై స్థాయి నుంచి జైలు అధికారులకు ఆదేశాలు వస్తున్నాయని కింది స్థాయి జైలు సిబ్బందే చెబుతున్నారు. అన్ని విధాలుగా జైల్లో కూడా రాచమర్యాదలు అందుతుండటంతో ఆయన ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లుగా జైలే భేషుగ్గా ఉందని ఫీలవుతున్నారట.

జైలులోంచే తన బయటి దందాలు దర్జాగా చేసుకుంటున్నారట. నిత్యం నిబంధనలతో సంబంధం లేకుండా వరుస ములాఖత్ లలో అనంత బాబు యమా బిజీగా ఉన్నారట. జైలులో ఆయనను కలవడానికి వచ్చే వారిలో అత్యధికులు వైసీపీ వారేనని కూడా జైలు సిబ్బంది ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా అనంతబాబుతో ములాఖత్ అయ్యారని చెబుతున్నారు. జైల్లో తోటి ఖైదీలపై అనంతబాబు దాష్టీకం చేస్తున్నాడనీ, మాట వినలేదని ఒక ఖైదీ పై చేయి చేసుకున్నాడనీ సమాచారం. అయితే జైలు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఖైదీలకు కలిపి ఒక గది ఇవ్వాలనీ, కానీ అనంతబాబుకు జైలు అధకారులు ఇస్తున్న రాచమర్యాదలలో భాగంగా ప్రత్యేకంగా గది కేటాయించారనీ చెబుతున్నారు. అలాగే ఖైదీలకు బయట నుంచి భోజనాన్ని అనుమతించరు. కానీ అనంత బాబుకు మాత్రం ప్రతి రోజూ బయట నుంచి మృష్టాన్న భోజనం అందుతోందని జైలు సిబ్బందే చెబుతున్నారు.