జగ్గన్నా.. వెళ్లొద్దన్నా! కాళ్లు పట్టుకున్న సీనియర్ నేత.. రాజీనామాపై వెనక్కి!
Published on: Sat Feb 19, 2022 11:29AM
జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారు. ఇక తనవల్ల కాదని.. రేవంత్‌రెడ్డితో పడలేనని.. పార్టీలో ఉండలేనంటూ.. హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ వీడే ప్రయత్నాల్లో కార్యకర్తలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రకటించడం ఒక్కటే మిగిలిందని అంటున్నారు.
జగ్గన్న కాంగ్రెస్‌ను వీడుతున్నారని తెలీగానే.. సీనియర్ మోస్ట్ లీడర్ వి.హనుమంతన్న వాలిపోయారు. జగ్గారెడ్డి ఇంటికొచ్చి మరీ.. పార్టీ వీడొద్దంటూ నచ్చజెప్పారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు.
అయినా, జగ్గారెడ్డి మనసు మారలేదు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం చెబుతానంటూ వీహెచ్‌కు సెలవిచ్చారు జగ్గారెడ్డి. దీంతో.. అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఒక్కసారిగా భావోద్రేకానికి లోనయ్యారు. ఏకంగా కాళ్ల మీద పడి.. కాంగ్రెస్‌ను వీడొద్దంటూ వేడుకున్నారు. ఆ సీన్.. బాగా ఎమోషనల్‌గా ఉంది. ఆ వీడియో, ఫోటోలు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక, సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్ అన్నారు. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్ చేశారని చెప్పారు. అధికారపార్టీకి అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకూ ఫిర్యాదు చేస్తానన్నారు. జగ్గారెడ్డి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు, ‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారు. నేను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారు. తట్టుకోలేకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నా’ అని జగ్గారెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపిస్తానని చెప్పారు.
కొంతకాలంగా రేవంత్‌రెడ్డికి, జగ్గారెడ్డికి అసలేమాత్రం పడట్లేదు. ఈయన ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక ఇటీవల ఓ ప్రొగ్రామ్‌లో మంత్రి కేటీఆర్‌తో, జగ్గారెడ్డి సన్నిహితంగా ఉండటం, వారిద్దరూ పర్సనల్‌గా మాట్లాడుకోవడం.. ఇక సంగారెడ్డి జిల్లాలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలను నువ్వే బాగా చూసుకోవాలంటూ కేటీఆర్ జగ్గారెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేయడంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారనే విషయం కన్ఫామ్ అవుతోంది. అయితే, తనపై అనర్హత వేటు పడకుండా ఇప్పటికిప్పుడే కారు ఎక్కరని.. కొన్నాళ్లు న్యూట్రల్‌గా ఉండి.. ఎన్నికల నాటికి గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
అయితే, వీహెచ్ రాయబారం తర్వాత కాస్త వెనక్కి తగ్గారు జగ్గారెడ్డి. పార్టీ సూచన మేరకు తన రాజీనామా నిర్ణయం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.


