TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగ్గారెడ్డి రాజీ..నామా!?

Published on: Sat Feb 26, 2022 1:55PM

కాంగ్రెస్ పార్టీకి అస్మంతి కొత్త కాదు. తెలంగాణ కాంగ్రెస్ అందుకు మినహాయింపు కాదు. నిజానికి, జాతీయ స్థాయిలో అయినా, రాష్ట్రాలలోనే అయినా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నిత్యాగ్నిహోత్రంలా అలా రగులుతూనే ఉంటుంది. వ్యక్తులు మారవచ్చును కానీ అగ్నిహోత్రం మాత్రం ఆరదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రగులుతున్న అసమ్మతికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కేంద్ర బిందువుగా నిలిచారు. గత కొంత కాలంగా ఆయన రాజీనామా చేస్తానంటూ, తెగ సందడి చేస్తున్నారు. కానీ, చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు మరీ కామెడీగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కలిసే వరకు తాను రాజీనామా చేయబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. అందుకో కారణం కూడా చెప్పారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు. అంతే కాదు, సోనియా,రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అంటే, జగ్గారెడ్డి రాజీనామాను నిరవధికంగా వాయిదా వేసినట్లే అంటున్నారు. 

సోనియా, రాహుల్  గాంధీ సంగారెడ్డి సభకు రావడం, అసలు అలాంటి సభకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వడం అయ్యే పనికాదు. అది అందరికీ తెలిసిన విషయం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత గిరిజన నిరుద్యోగ, వ్యవసాయ సమస్యలపై అనేక ప్రజా పీసీసీ అధ్వర్యంలో  అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఒకటి రెండు సందర్భాలలో రాహుల గాంధీ ఆ సభలో పాల్గొంటారని ప్రచారం కూడా జరిగింది.అయినా, ఆయన రాలేదు. సో, పీసీసీ తరపున ఏర్పాటు చేసిన సభలకే రాని రాహుల్ గాంధీ, అసమ్మతి గళం వినిపించేందుకు   జగ్గారెడ్డి ఏర్పాటు చేసే  సభకు రాహుల్  రావడం అయ్యే పని కాదు.అలాగే, సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. సో, ఆ  ఇద్దరి అద్వర్యంలో సభ జరగదు. అందుకే కర్ర విరగదు, పాము చావదు. జగ్గ రెడ్డి రాజీనామా చేయరు, అంటున్నారు అన్నీ తెలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు. 

అయితే మార్చి ఇరవై ఒకటో తేదీ లోపు హైకమాండ్ నుంచి పిలుపు రాకపోతే తాను నిర్వహించబోయే బహిరంగసభ వేదిక నుంచి రాజీనామా ప్రకటించి ఆ తర్వాత ఆయన కారెక్కే  అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక జగ్గారెడ్డి, ఉంటే ఉండాలి,పోతే పోవాలి అంతే కానీ, పార్టీని బద్నాం చేయాడనికే జగ్గారెడ్డి డ్రామా చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది.