పట్టాలు తప్పుతున్నాయా... పట్టు తప్పుతున్నాయా?

 

ఒక రైలు పట్టాలు తప్పటం... ప్రమాదానికి దూరంగా వున్న మనకంతా టీవీలో బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. కాని, అదే ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన వారికి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూస్. తెల్లవారితే తమ గమ్యాల్ని చేరుకుంటామని నిద్దురలోకి జారుకున్న సామాన్యుల బతుకులు అలాగే తెల్లారిపోయాయి. నలభై మందికి పైగా చనిపోతే, యాభై మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇదంతా ఒక కోణం మాత్రమే. మరో విస్త్రృత కోణంలో చూసినప్పుడు దీని వెనుక కుట్ర దాగుందని నిఘా వర్గాలు అనుమానిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒకవైపు ఐఎస్ఐ, మరో వైపు నక్సల్స్ ఇద్దరూ వుండొచ్చని చెబుతుండటం మరింత తీవ్రత పెంచుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య భారతీయులు సైతం ఇప్పుడు తమకు తెలియకుండానే యుద్ధంలో సైనికులు అయిపోయారు. శత్రువులు నిరాయుధులైన రైలు ప్రయాణికుల్నే తమ టార్గెట్ చేసుకున్నారు...

 

జగదల్ పూర్ భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పిందా? కాదనే అంటున్నారు చాలా మంది. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు ఇలా వుండవని అంటున్నారు. చలి విపరీతంగా వుండే ఉత్తరాదిలో పట్టాలు కోతకు గురవుతుంటాయి. అలాంటి పరిస్థితి మన ఆంద్రప్రదేశ్ లో వుండదంటున్నారు. ఇక అంతకు కొన్ని నిమిషాల ముందు గూడ్స్ బండి సురక్షితంగా వెళ్లిన చోటే హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావటం ఖచ్చితంగా కుట్ర కోణాన్ని సూచిస్తుందంటున్నారు. ఈ పని మావోయిస్టులు చేసి వుండవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అది నిజం అనటానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాని, నిజమైతే మాత్రం అది పరమ కిరాతకం. సాయుధులైన మావోలు ప్రభుత్వ బలగాలతో యుద్ధం చేయాలిగాని సామాన్యుల్ని పణంగా పెట్టకూడదు.

 

ఇప్పుడు జరిగిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనే కాదు ఇంతకు ముందు జరిగిన మరో రెండు ప్రమాదాలు కూడా కుట్ర వల్లే జరిగాయని తాజాగా వెల్లడైంది. 2016 నవంబర్ 20న జరిగిన పాట్నా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 151మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 28న జరిగిన అజ్మీర్ ఎక్స్ ప్రెస్ విషాదంలో 63మంది సమిధలయ్యారు. వీరంతా కూడా యాక్సిడెంట్లో చనిపోయారనే మొదటగా భావించాం. కాని, ఈ మధ్యే బీహార్లో అరెస్టైన ఒక ఉగ్రవాది చెప్పిన దాని ప్రకారం దాదాపు రెండు వందల మందిని బలి తీసుకున్న ఆ రెండు ట్రైన్ యాక్సిడెంట్స్ పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రతో జరిగాయని బయటపడుతోంది. ఇది నిజమని ఇంకా తేలనప్పటికీ మనం ఆశ్చర్యపోవటానికి మాత్రం వీలు లేదు. విభ్రాంతికర రీతిలో మన మీద విరుచుకుపడటానికి మన శత్రువులు ఇంటా, బయటా ఎప్పుడూ సిద్ధంగానే వుంటూ వస్తున్నారు. ఐఎస్ఐ, ఐసిస్ మొదలు నక్సల్స్, ఉల్ఫాల వరకూ బోలెడు మంది ఇదే కోవలోకి వస్తారు.

 

కొందరు మతానికి, కొందరికి జాతి, కొందరికి ప్రాంతం, కొందరికి వామపక్ష ఆదర్శవాదం... ఎవరి కారణాలు ఏవైనా సామాన్యులకే ప్రాణ సంకటంగా మారుతోంది.65వేల కిలో మీటర్ల విస్తీర్ణంలో రైళ్లు నడిపే ఇండియన్ రైల్వేస్ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాల్లో పూర్తి బాధ్యత రైల్వేస్ దే. కాని, ఉగ్రవాదులు, ఇతర సంఘ విద్రోహ శక్తులు దారుణానికి పాల్పడితే రైల్వే చేయగలిగింది ఏం లేదు. అది నిఘా వర్గాలు, ప్రభుత్వ భద్రతా బలగాలు అరికట్టాల్సింది. అయినా కూడా రైల్వే శాఖ కోట్లాది మందికి జీవనాడి లాంటి రైల్వేను మరింత సురక్షితంగా మార్చాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా ఉద్యోగాలు భర్తీ చేయటం, టెక్నాలజీని అభివృద్ధి పరుచుకోవటం వంటివి చేపట్టాలి. అప్పుడే ప్రపంచపు అతి పెద్ద సంస్థ అయిన భారతీయ రైల్వే భద్రంగా మనగలుగుతుంది...