TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పాదయాత్ర 2.o: ఆరు నెలల ముందుకు.. కారణాలేంటంటే.?

Published on: Thu Nov 19, 2026 9:20AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి ఆసక్తికరమైన ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతకాలం 2027 అక్టోబర్ లేదా నవంబర్లో  జగన్ తన  పాదయాత్ర ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి.  అయితే ఇప్పుడు తాజాగా ఆయన తన పాదయాత్ర ఆరు నెలలు ముందుకు జరిపే యోచనలో ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.   అయితే ఇందుకు సంబంధించి వైసీపీ నుంచి కానీ, స్వయంగా జగన్ నుంచి కానీ ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. 

గతంలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచిన సంగతి విదితమే. 2017లో ప్రారంభమై దాదాపు 3,648 కిలోమీటర్లకు పైగా సాగిన ఆ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, స్థానిక నాయకులు, కార్యకర్తలతో మమేకం కావడం  అప్పట్లో జగన్ కు, వైసీపీకి గణనీయమైన రాజకీయ బలాన్ని చేకూర్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు 2029 ఎన్నికలలో విజయం సాధించి మరో సారి అధికారాన్ని దక్కించుకోవాలంటే పాదయాత్ర వినా మరో మార్గం లేదన్న అభిప్రాయం జగన్ లోనూ, పార్టీ వర్గాల్లోనూ బలంగా ఉంది.  అందుకు అనుగుణంగానే జగన్ తాను 2027లో మరో సారి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ముందస్తుగా ఆయన తన పాదయాత్రను 2027 అక్టోబర్ లేదా నవంబర్ లొ మొదలు పెట్టాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అంత వరకూ కాకుండా ఓ ఆరు నెలలు ముందుగానే అంటే వచ్చే ఏడాది మార్చి నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

అయితే.. పాదయాత్రను ముందుకు జరపాలనే ఆలోచన వెనుక  ఉన్న కారణాలపై పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సారి కేవలం పాదయాత్ర ద్వారా పార్టీ పుంజుకునే అవకాశం లేదనీ, పార్టీ అంతర్గత ప్రక్షాళన కూడా అవసరమన్న ఉద్దేశంతోనే పుణ్యం పురుషార్థం కలిసివచ్చేలా పాదయాత్రను ఓ ఆరు నెలల ముందుకు జరిపి.. పార్టీ ప్రక్షాళన కూడా  చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అలాగే వచ్చే ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వం, చురుకైన క్యాడర్, ప్రజలతో నిరంతర సంబంధాలు ఏర్పరుచుకునేలా ఈ సారి జగన్ తన పాదయాత్ర సాగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, పనితీరు సరిగా లేని నియోజకవర్గాలలో ప్రస్తుత ఇన్ చార్జీల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, అలాగే తన పాదయాత్రలో భాగంగా నియోజవర్గాలలో పార్టీ పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడం అన్నీ కూడా పాదయాత్రలో భాగంగానే చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   ప్రజల్లో పలుకుబడి లేని నేతలు, కార్యకర్తలను పట్టించుకోని నేతలకు ప్రాధాన్యత తగ్గించి, కొత్తవారు, సమర్ధులకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. తన పాదయాత్రలోనే   ప్రతి నియోజకవర్గ వాస్తవ పరిస్థితిని జగన్ స్వయంగా అంచనా వేయాలని నిర్ణయించుకున్న జగన్, తన పాదయాత్రను మార్చి నుంచే మొదలు పెట్టడం ద్వారా అందుకు అవసరమైన సమయం లభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జమిలి ఎన్నికల అంశం కూడా జగన్ తన పాదయాత్రను ముందుకు జరపాలన్న నిర్ణయానికి రావడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణ షెడ్యూల్ ప్రకారం 2029లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఒకేసారి ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో 2028 చివరి నాటికే ఎన్నికలు రావచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ తన పాదయాత్రను 2027 మార్చి నుంచే ప్రారంభించాని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇంకా అధికారిక నిర్ణయం లేకపోయినా, ఒకవేళ ఎన్నికలు ముందుకు వస్తే సమయం తక్కువగా ఉంటుందనే లెక్కతో 2027 మార్చి నుంచే యాత్ర ప్రారంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి, పార్టీని సిద్ధం చేయడానికి తగినంత వ్యవధి లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  జగన్ పాదయాత్ర ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే?​

గతంలో పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ వాతావరణం భిన్నంగా ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను మలుచుకునే అవకాశం లభించగా, అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న నేపథ్యంలో  2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు ఆ ప్రాజా వ్యతిరేకతను పోగొట్టుకోవడమే కాకుండా, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉండటంతో వచ్చే ఎన్నికలకు వైసీపీని  ఎదుర్కోవసలిన సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం, క్షేత్రస్థాయిలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపడం, యాత్రలో భాగస్వాములయ్యే నేతలు, ఇంచార్జీల సమన్వయం వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి.  

రాజకీయ కోణంలో చూస్తే, నియోజకవర్గాల వారీగా మార్పులు చేయడం, కార్యకర్తలను సమాయత్తం చేయడం, ప్రజలతో నేరుగా మమేకం కావడం వంటి బహుళ లక్ష్యాలను సాధించేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతోనే పార్టీ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా రానున్న ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ మరోసారి పాదయాత్రతో ప్రజల్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఆ యాత్ర పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందనే దానిపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చవచ్చు:   పాదయాత్రలతోనే విజయం సాధ్యమా..? ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం..!​

జగన్ పాదయాత్ర..ముహూర్తం మారింది.!?

[JaganPadayatra, YCP, AP Politics, Sixmonths, Early, Partyneeds, Leaderscoordination,  TeluguOne]