TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే నెల విశాఖ నుంచే జగన్ పాలన? మరి హైకోర్టు ఊరుకుంటుందా?

Published on: Thu Jun 10, 2021 9:32PM

విశాఖ నుంచి పాలన ఖాయమేనా? ఆ విషయం మాట్లాడటానికే జగన్ ఢిల్లీ వెళ్లారా? లేదంటే మంత్రి బొత్స సత్యనారాయణ ఆ రేంజ్ లో ప్రకటన ఎలా చేస్తారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్నాయి. రాజధాని తరలింపుకు లీగల్ అడ్డంకులున్నాయి కాబట్టి..క్యాంప్ ఆఫీసు నుంచే జగన్ పాలన చేస్తారన్న వ్యూహం అమల్లోకి వచ్చేస్తున్నట్లే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లే..ఆయన ఒత్తిడితో విశాఖ నుంచి పాలన అనే అంకం మొదలవుతుందనే టాక్ వినపడుతోంది. కొన్ని విడి విడిగా వచ్చినవాటిని కలిపి చూస్తే అలాగే అనిపిస్తోంది.

జూన్ 3న ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పాలన అంటూ తన ఫోటోతో పోస్ట్ పెట్టారు. అందులో ఇంకేమీ రాయలేదు. గత వారంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల ప్రక్రియ ఆగే సమస్యే లేదన్నారు. నేడు వైసీపీకి మద్దతుగా ఓపెన్ గా రాస్తున్న ఓ వెబ్ పోర్టల్ లో జూలై 21 నుంచి విశాఖలోనే పాలన అంటూ స్టోరీ వచ్చింది. మధ్యాహ్నానికి మంత్రి బొత్స సత్యనారాయణ కోవిడ్ పరిస్ధితులు చక్కబడగానే విశాఖ నుంచే పాలన మొదలవుతుందని...జగన్ విశాఖ క్యాంప్ ఆఫీసు నుంచే పరిపాలన చేస్తారని చెప్పారు. రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన జగన్ .. అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కు చాలా విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బిజెపి.. ఈ విషయంలోనూ ఓకె చెప్పినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే.. వచ్చే నెలలో ఖాయంగా విశాఖ నుంచే జగన్ పాలన చేస్తారని బలంగా అనిపిస్తోంది.

మరి హైకోర్టు ఊరుకుంటుందా? అమరావతి రైతులు మరో పిటిషన్ వేస్తారా? మళ్లీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇస్తుందా?ఇవన్నీ ప్రశ్నలే.. సమాధానాలు తర్వాతే వస్తాయి. గతంలోనూ ఇలాగే దొడ్డిదారిన విశాఖకు రాజధాని తరలించాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయాయి.  అసలు మూడు రాజధానులు ప్రకటించిననాటి నుంచి రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. అప్పటికే ఆగిన అభివృద్ధి ..ఇక ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. 
ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి కలిపి అమరావతి కార్పొరేషన్ గా మార్చిన ప్రభుత్వం..అదే చూపించి.. కృష్ణా,గుంటూరు జిల్లా వాసులకు గుడ్ బై చెప్పేసి విశాఖకు వెళ్లిపోబోతుందా? ఎందుకంటే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఎక్కడా వైసీపీకి ఎదురు లేకుండా ఫలితాలు వచ్చాయి. కాబట్టి ప్రజల మద్దతు తమకే ఉందని వారు చెప్పుకుంటున్నారు. ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రెండు జిల్లాల్లోనూ వైసీపీకే అధిక స్థానాలు వచ్చాయి. అధికార బలం, అక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఎవరూ పట్టించుకునే పరిస్ధితిలో లేరు.

వీటన్నిటికన్నా.. కేంద్రంలోని తమ రహస్య స్నేహితుడు కమలనాథుడు ఇచ్చే సిగ్నలే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం. ఇప్పటికి వారు కన్విన్స్ అయి ఉంటే.. వారు ఓకె చెప్పిఉంటే..ఇక జగన్ విశాఖ పయనం ఎవరూ ఆపలేరు..ఒక్క న్యాయస్థానాలు తప్ప.