ఇంక సింహం సింగిల్ గా రాదా.. ఇండియా కూటమివైపు జగన్ మెగ్గు.!
Published on: Mon Nov 2, 2026 2:08PM

సింహం సింగిల్ గానే వస్తుందంటూ డైలాగులు దంచే జగన్ ఇప్పుడు రాజకీయ పొత్తు కోసం తహతహలాడుతున్నారు. ఇంత కాలం బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు. జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఆయన మొగ్గు ఇండియా కూటమి వైపు తిరిగినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్లో ఇప్పటివరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు బేషరతు మద్దతు ఇస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ పనితీరులో మరియు నిబంధనలలో సమూలమైన మార్పులు రావాలని, కొత్త సంస్కరణలను తీసుకురావాలని జగన్ గట్టిగా డిమాండ్ చేయడం ద్వారా తాను ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నానని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని పేర్కొన్న జగన్.. ఇండియా కూటమి ఎన్నికల సంఘం అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనలు, ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికల నిబంధనలను సవరించేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికార పక్షాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై అవసరమైతే తమ పార్టీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తుందన్న జగన్.. ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనలకు బేషరతు మద్దతు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఎన్నికల పారదర్శకతను కోరుతూ జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నాననే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన జగన్ ఒక్కసారిగా ఇలా ప్లేటు ఫిరాయించడంపై పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ విధానాలను ఇంత వరకూ కనీసం మాట మాత్రంగానైనా వ్యతిరేకించని జగన్ ఒకే సారి నేరుగా ఇండియా కూటమి ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించడం ఆయన బీజేపీకి దూరం జరుగుతున్నారన్న విశ్లేషణలకు తెరతీసింది.
[Jagan Support India Bloc, YSJagan, National, Politics, ECI, Reforms, Ycp, Political, Stand, Telugu One]


