రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల?

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నానా రచ్చ చేయడమే కాకుండా గౌరవనీయమైన సభాపతి స్థానాన్ని కూడా అవమాన పరిచేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. గంటలు గంటలు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష నాయకుడు జగన్ మొత్తుకోవడం ఏపీ ప్రజలు గమనించారు. అధికార పక్షం మీద లేనిపోని ఆరోపణలు, హద్దూ అదుపూ లేని విమర్శలు వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకుడు జగన్, ఆయన అడుగు జాడల్లో నడిచే ఇతర సభ్యులు ఎంతమాత్రం వెనుకాడలేదు. వైసీపీ సభ్యురాలు రోజా అయితే కర్ణకఠోరమైన వ్యాఖ్యలతో తన పరువును తానే దిగజార్జుకున్నారు. అలాగే మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అంత అల్లరి చేసిన వైసీపీ చివరికి సభాపతి మీదే అన్యాయమైన ఆరోపణలు చేసింది. చివరికి ఆయన మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. అయితే, అయితే అసెంబ్లీలో వైసీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన మీద సభాపతి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ వుండటంలో ఎట్టకేలకు దారికొచ్చిన వైసీపీ నాయకుడు జగన్ సారీ చెప్పుకున్ని వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు సారీ చెప్పకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం వుందని గ్రహించిన జగన్ సారీ చెప్పి గండం నుంచి బయటపడ్డారు. .

 

అసెంబ్లీకి సంబంధించినంత వరకూ జగన్ సారీతో ఈ వివాదం ముగిసిపోయి వుండొచ్చు. కానీ జనం దృష్టిలోంచి మాత్రం ఈ గొడవంతా తొలిగిపోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రజలు ఈ అంశం విషయంలో ‘‘రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల’’ అనుకుంటున్నారు. అనవసరంగా అయిన దానికీ కానిదానికీ రచ్చ చేసి చివరికి సారీ చెప్పుకునే పరిస్థితిని వైసీపీ నాయకులు చేతులారా తెచ్చుకున్నారని అనుకుంటున్నారు. సారీ చెప్పిన తరువాత జగన్ మాట్లాడిన మాటలు విని జనం అవాక్కయిపోతున్నారు. సభాపతి మీద కోపంతోనో, ఆయన్ని పదవినుంచి దించేయాలనో జగన్ అండ్ కో అవిశ్వాస తీర్మానం పెట్టలేదట. ప్రజా సమస్యల ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారట. అవిశ్వాస తీర్మానం మీద జగన్ చెబుతున్న రీజన్ ఏమైనా అతికేట్టు వుందా? ఇలాంటి లేనిపోని రాద్ధాంతాలు చేయడమెందుకు, ఆ తర్వాత సారీ చెప్పడం ఎందుకు, విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? అందుకే జగన్ తన వైఖరిని మార్చుకునే విషయాన్ని తీవ్రంగా ఆలోచించుకోవాలి.