జగన్ సార్...కేసీఆర్ గారిని మీ అంత బాగా అర్ధం చేసుకున్న వారు లేరేమో ?

 

కేసీఆర్ ని, ఆయ‌న గొప్ప మ‌న‌సును జ‌గ‌న్ మాదిరి అర్థం చేసుకున్నోళ్లు ఇంకెవరూ ఉండ‌రేమో ? తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న మాట‌లు వింటే అలానే అనిపిస్త్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్య‌త ఉండ‌టం చాలా అవసరం. కానీ జగన్ చూపుతున్న అతి ప్రేమ ఆయన కొంప ముంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి నిన్న అసెంబ్లీ ప్రొజెక్ట్ స్క్రీన్ అయ్యింది. 

ఎందుకో ఏమో కానీ గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలంలో క‌ల‌పాల‌న్న రూ.లక్ష‌న్న‌ర కోట్ల ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న అతి శ్రద్ద ఆయన కొంప ముంచక తప్పదని అంటున్నారు. ఆయన మాటలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే కేసీఆర్ ఏపీకి గోదావరి నీళ్లు ఇచ్చేందుకే ఈ లక్షన్నర కోట్ల కొత్త ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని, కేసీఆర్ నీళ్లిస్తూంటే ప్రతిపక్ష పార్టీ వద్దంటున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. 

అయితే అసలు నిజంగా మనకు కేసీఆర్ నీళ్లిస్తున్నారా..? మన నీళ్లలో అనధికారికంగా వాటా పొందుతున్నారా..? అనేది కొంచెం లోకజ్ఞానం ఉన్నవారికి ఎవరికీ అయినా అర్ధం అవుతుంది. నిజానికి ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. తెలంగాణ సర్కార్‌తో.. అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నీటి పారుదలకి సంబంధించి రెండు ప్రభుత్వాలు చేసిన ఆలోచన గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం. 

రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి పూర్తి చేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయం మీద ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లలు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమకు నీటి కరువు ఉండదని ఏపీ అధికార పార్టీ చెబుతోంది. కానీ నిపుణులు, విశ్లేషకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర హక్కు అయిన నీళ్లను తెలంగాణ వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ కి కేసీఆర్ రూపకల్పన చేశారని అంటున్నారు.

తాజాగా నీటిపారుదల, ప్రాజెక్టుల విషయంలో కాస్త పట్టున్న సీనియర్ నేతలు మైసూరారెడ్డి, తులసీరెడ్డి కడపలో ఓ మీటింగ్ పెట్టి నిపుణులతో చర్చించి అసలు తెలంగాణ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా వాడుకోవాలని చూస్తున్నారో క్లారిటీ ఇచ్చారు. గోదావరి నికర జలాలపై సంపూర్ణ హక్కులు ఏపీకే ఉన్నాయి, మిగులు జలాల్ని ఏదోలా తీసుకునేందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు పెట్టిందని చెబుతున్నారు. 

గోదావరి నికర జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంతో కలిసి పంచుకోవడం ఎందుకనే ప్రశ్న మొదలువుతోంది. కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పి ఏపీ నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేతనే ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మించడం అంటే ఎంత తెలివి తక్కువ పనో అర్ధం అవుతుందని అంటున్నారు. జ‌గ‌న్ మాట‌ల‌న్ని ఎలా ఉన్నాయంటే.. ఈ ప్రాజెక్టు లేకపోతే ఏపీకి భ‌విష్యత్తే లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం కనిపిస్తుంది. మరి అయన ఎందుకు ఇంతగా సాగిల పడుతున్నారో మరి ?