బావమరిది శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం...జగన్ ఫైర్

 

ఈరోజు ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ఈరోజు ఇంత ఆధ్వానమైన పరిస్థితుల్లో ఉందంటే చంద్రబాబు అనే వ్యక్తి ఐదేళ్లు పరిపాలించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు తీసుకెళితే రెండు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగవా ? బుద్ధీ,  జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది అర్థం కాదా  ? ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఇవన్నీ ఆయనకీ తెలియవా అని జగన్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లే నీళ్లు వల్ల ఇటు ఏపీ అటు తెలంగాణ జిల్లాలు బాగుపడతాయి. దీనిపై సంతోషించాల్సింది పోయి ఇలా మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు. 

అలాగే ద్వైపాక్షిక ఒప్పందాలను జగన్, కేసీఆర్ చేసుకోవడం లేదు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య, ఐఏఎస్ అధికారుల మధ్య జరుగుతోందని నిజంగానే ఇది సమస్య అవుతుందని చెబితే ఏపీ విభజన సందర్భంగా చంద్రబాబు ఎందుకు మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారని జగన్ ప్రశ్నించారు. విభజన నాదే శ్రీశైలం నాగార్జునసాగర్ మాకు ఇవ్వండని చంద్రబాబు ఎందుకు అడగలేదు? ఏం.. సోనియాగాంధీ అంటే భయమా?  అని జగన్ ప్రశ్నించారు. 

ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏపీ-తెలంగాణకు మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయని అవన్నీ తెలిసి కూడా కేవలం ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కల్పించడం కోసం ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ తో కలవకుండా కేంద్రం కుట్ర చేసిందని చంద్రబాబు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారని సొంత బావమరిది హరికృష్ణ అంత్యక్రియల కోసం అక్కడికి వచ్చిన కేటీఆర్ తో పొత్తుల కోసం మాట్లాడాడు ఈ పెద్దమనిషి. అప్పుడు మా మంత్రి కొడాలి నాని కూడా అక్కడే ఉన్నాడని జగన్ వ్యాఖ్యానించారు ఈ ప్రపంచంలో చంద్రబాబు అంత దుర్మార్గమైన నాయకుడు ఎవరూ ఉండరని సీఎం జగన్ దుయ్యబట్టారు.