TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ రూటు మార్చాడా?

Published on: Tue Jan 27, 2015 4:24PM



పాపం జగన్.. గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేస్తానని కలలు కన్నాడు. దేవుడికి దణ్ణాల మీద దణ్ణాలు పెట్టాడు. తాను నమ్మే దేవుణ్ణి కూడా తన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న చర్చ్‌లను వైకాపా ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దాడు. తనను కూడా రాజకీయాల్లోకి లాగినందుకు ఆ ప్రభువు ఆగ్రహించాడో ఏమోగానీ జగన్ పరిస్థితి తెలంగాణ ఖాళీ అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అంత సీన్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాను నమ్మిన దేవుడికి దూరంగా జరుగుతూ, హిందూ సంప్రదాయాలకు దగ్గరవుతున్నారా అనే సందేహాలు ఆయన వ్యవహార శైలిని చూస్తే కలుగుతున్నాయి.

జగన్ కుటుంబం ఆయన తాత రాజారెడ్డి హయాంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం క్రైస్తవాన్నే అనుసరిస్తోంది. జగన్ బావగారు అనిల్ అయితే స్వయానా క్రైస్తవ మత ప్రచారకుడు. సాధారణంగా క్రైస్తవులు తమ మతాన్ని తాము గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. అయితే, జగన్‌కి హిందూ మతం మీదగానీ, హిందూ ఆచార వ్యవహారాల మీద గానీ అంత గౌరవం లేదన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. దీనికి ఉదాహరణగా గతంలో జరిగిన కొన్ని ఘటనలను కూడా చెబుతూ వుంటారు. ఈ సారు గతంలో తిరుమల దేవాలయానికి వెళ్ళిన సమయంలో చెప్పులు వేసుకునే వెళ్ళారని, అన్య మతస్తులు తిరుమల దేవాలయానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. అలాంటి సంప్రదాయాన్ని పాటించకుండానే ఆయన దేవాలయంలోకి వెళ్ళారని విమర్శలు వున్నాయి. అలాగే తిరుమలలో స్వామివారి కీర్తనం తప్ప మరొకరి కీర్తన జరగడానికి వీల్లేదు. అలాంటి తిరుమలలో తనకు జేజేలు కొట్టించుకున్న ఘనత కూడా జగన్ సార్‌కి వుంది. ఇలా హిందూ మతం మీద ఇంతటి చిన్న చూపు వున్న జగన్ ఇప్పుడు సడెన్‌గా రూటు మార్చినట్టు అనిపిస్తోంది. హిందూ సంప్రదాయాల మీద గౌరవం పెరిగిపోయినట్టు కనిపిస్తోంది.

మంగళవారం నాడు విశాఖ పర్యటనకు వెళ్ళిన జగన్ సింహాచలం దేవాలయానికి వెళ్తున్నారని, ఆ తర్వాత విశాఖ శ్రీ శారదా పీఠానికి వెళ్ళి అక్కడ జరిగే యజ్ఞంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది నిజంగా వింతే. జగనేంటి.. ఇలా హిందూ సంప్రదాయాలను ఆచరించడమేంటని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఇలా సింహాచలం దేవాలయానికి వెళ్ళడం, శారదా పీఠం యజ్ఞంలో పాల్గొనడం వెనుక రెండే కారణాలు ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొదటిది... జగన్ మీద ఇప్పటికే హిందూ వ్యతిరేకి ముద్ర బాగా బలంగా పడిపోయింది. ఆ ముద్రని తొలగించుకోవడం కోసమే ఇలా చేస్తూ వుండొచ్చు. రెండోది... వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే తన శక్తి సరిపోదని జగన్‌కి క్లియర్‌గా అర్థమైపోవడంతో ఇక హిందూ దేవుళ్ళని, యజ్ఞాలని నమ్ముకుంటున్నాడు. మొదటిదైనా, రెండోదైనా మొత్తానికి అధికారం కోసమే జగన్ రూటు మార్చినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.