TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్

Published on: Thu Jul 3, 2025 2:55PM

మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి  పాదయాత్రతోనే అధికారంలో రావాలని భావిస్తున్నారు. మొత్తానికి పరదాల మాటు సీఎం  అనిపించుకున్న జగన్ ఇప్పుడు పాదయాత్రం అంటుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తానని  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్‌.  జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది. 

జగన్‌కు పాదయాత్ర కొత్త ఏమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు.  వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో రెండు రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ  పర్యటనల షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించనే లేదు. ఈ సారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో అయన వెల్లడించలేదు. 

అదలా ఉంటే.. అధికారంలో ఉన్నంత కాలం బయటకొస్తే పరదాల మాటున పాలన కొనసాగించిన జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటుండటంపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా జనంలోకి రావడానికి సంకోచిస్తున్నట్లు పరదాల మాటునే గడిసేసిన ఆయన పాదయాత్ర అంటుండటంతో.. పరదాలు పోయి, పాదయాత్ర వచ్చిందని నెటిజన్లు  ఎద్దేవా చేస్తున్నారు. పవర్ పోగానే ప్రజల్లోకి వస్తానంటుండటంతో అప్పుడు జనం గుర్తుకు రాలేదా అన్న విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి.