TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ మీద రైతులకు భరోసా లేదు

Published on: Mon Feb 23, 2015 1:38PM

 

పొలిటికల్ కామెడీ చేయడంలో వైసీపీ అధినేత జగన్ తర్వాతే ఎవరైనా. తాను చేస్తున్నది రాజకీయం కాదని.. పొలిటికల్ కామెడీ అని ఆయనకు స్పష్టంగా తెలిసినా, అదే బాటలో పయనించడం మానుకోని నిబద్ధత ఆయన సొంతం. అదే ఆయన్ని ప్రజలకు దూరం చేసింది. ఆయన అలాగే వుంటే ఎప్పటికీ అధికారానికి దూరంగా వుంటారు. ప్రజలకు కూడా అదే మంచిది. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న జగన్ తనవంతు సహకారాన్ని అందించాలి. అయితే ఆయన అలాంటి మంచి పనుల జోలికి వెళ్ళకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బద్నామ్ చేయాలా అనో ఆలోచనతోనే నిరంతరం వుంటున్నారు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని సీఎం చంద్రబాబు మీద విమర్శలు కురిపిస్తున్నారు. అయితే చాలా తెలివైన వారైన ప్రజలు ఆయన్ని ఇప్పటికే అధికారానికి దూరంగా వుంచారు. అదే బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మడం లేదు. అయినప్పటికీ జగన్ తన దుష్ప్రచారాన్ని మానలేదు.

 

తాజాగా ఆయన రైతు భరోసా యాత్రల పేరితో మరో దుష్ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఊరూరా తిరుగుతూ అందరి నుదుట ముద్దులు పెడుతూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇస్తే, అదే మాట చెప్పడానికి జగన్‌కి నోరు రాలేదు. ఇప్పుడు అదే జగన్ చంద్రబాబుకు రైతులకు అన్యాయం చేస్తున్నారని, రైతులకు తాను భరోసాగా నిలుస్తానని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ చేస్తున్నది తమకు భరోసా ఇవ్వడానికి చేస్తున్న యాత్ర కాదని, వచ్చే ఎన్నికలలో తమ నుంచి ఓట్లు వేస్తామని భరోసా పొందడానికి చేస్తున్న యాత్రేనని రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ యాత్రే తప్ప నిజంగా రైతుల మీద ప్రేమ వుండి చేస్తున్న యాత్ర కాదని అంటున్నారు. కొన్నిచోట్ల అయితే జగన్ ఏర్పాటు చేసిన సభలకు సొంత పార్టీ రైతులు కూడా హాజరు కావడం లేదు. ఇదిలా వుంటే సోమవారం నాడు జగన్ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కొత్తకోటలో రైతు భరోసా యాత్ర చేశారు. అయితే ఆయన యాత్రకు ఆ గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. జగన్ వచ్చిన సమయానికి రైతులందరూ ఇళ్ళలోంచి బయటకి రాకుండా తలుపులు వేసుకుని లోపలే వుండిపోయారు. దాంతో జగన్ నోరు తెరవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలను చూసైనా జగన్ తన యాత్రలను మానుకుంటే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.