జగన్ బాణం మళ్ళీ దూసుకొస్తోంది
Published on: Tue Aug 28, 2018 4:59PM
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ సోదరి 'షర్మిల' తెలుగు ప్రజలకు సుపరిచితమే.. అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల వైసీపీలో కీలకంగా వ్యవహరించారు.. పాదయాత్ర చేసి, జగన్ ని అన్యాయంగా జైలులో పెట్టారనే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు.. జగన్ జైలులో ఉన్నా, జగన్ వదిలిన షర్మిల అనే బాణం దూసుకుపోతోందని కార్యకర్తలు సంబరపడిపోయారు.. ఒకానొక సమయంలో వైసీపీ అంటే షర్మిల అనుకునే స్థాయికి వెళ్ళింది.. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా.. అది షర్మిల విషయంలో కూడా రుజువైంది.. జగన్ విడుదల, రాష్ట్ర విభజన జరిగిపోయాయి.. ఇంతలో 2014 ఎన్నికలు వచ్చాయి.. షర్మిలను జగన్ పక్కన పెట్టారో లేక షర్మిలే పక్కకి వెళ్లారో తెలీదు కానీ.. అప్పటివరకు పాదయాత్ర, స్పీచ్ లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన షర్మిల, ఎన్నికల బరిలోకి దిగలేదు.. తరువాత రాజకీయాలకు కూడా దూరమవుతూ వచ్చారు.. ఇంచు మించు ఆమెని అందరూ మర్చిపోయారు.

అయితే ఇప్పుడు షర్మిల గురించి పార్టీలో చర్చ మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో ఆమెని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారట.. రాజంపేట లేదా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి షర్మిలను బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. మరోవైపు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.. షర్మిల ఎక్కడ నుండి బరిలోకి దిగుతారో తెలీదు కానీ బరిలోకి దిగటం మాత్రం పక్క అంటూ చర్చలు జరుగుతున్నాయి.. అదే విధంగా షర్మిల వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. గత ఎన్నికల కంటే ముందు జగన్ వదిలిన షర్మిల అనే బాణం దూసుకొచ్చింది తరువాత సుమారు నాలుగున్నరేళ్ళు పాటు కనిపించకుండా పోయింది.. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత తిరిగొస్తున్న బాణం, మరి దూసుకెళ్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.


