జగన్ ప్లేస్ కోసమేనా పవన్ ప్లాన్...!

 

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అన్న దానికి పవన్ కళ్యాణ్ స్పీచే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్నటి వరకూ టీడీపీ పై ఎలాంటి విమర్సలు గుప్పించని పవన్.. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ పార్టీ పై లేదా బీజేపీ పై సెటైర్లు, విమర్శలు చేసే పవన్ ఈసారి మాత్రం టీడీపీ పైనే విమర్శలు గుప్పించారు. కేంద్రంపై, వైసీపీపై ఏదో రెండు మూడు విమర్శలు చేసినా.. టార్గెట్ మొత్తం టీడీపీపైనే చేశారు. ముఖ్యంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.

 

అయితే ఇక్కడే ఓ ఆసక్తిర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. అయితే ఆ విషయం జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే... వైసీపీ ప్రతిపక్షపార్టీ అన్న పేరే కానీ ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాడింది లేదు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. పోనీ తాను రాకపోయినా.. పార్టీ నేతలను అయినా పంపిస్తారంటే అదీ లేదు... తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు అని కండీషన్స్ పెడుతుంటాడు. సరే ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా.. దానిని పరిష్కరించకుండా.. నేను సీఎం అయిన తరువాత చేస్తా.. అప్పుడు చూస్తా అని కబుర్లు చెబుతుంటాడు. దీంతో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది. ఇక సీబీఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో.. విలీనమో.. ఖరారు చేసుకోవడానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష స్థానానికి పూర్తి స్థాయి ఖాళీ ఏర్పడింది.

 

ఇక దీన్నే పవన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీకి అనేక విషయాన్ని మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తే అంశాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ… పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ… విమర్శలు ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా.. పవన్ కల్యాణ్ .. టీడీపీకి పూర్తి స్థాయిలో తన విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలా వెళితేనే రాజకీయంగా ముందుంటామని నిర్ణయించుకున్నట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక నిజమైతే.. జగన్ సీఎం అవ్వడం ఏమో కానీ.... ప్రతిపక్ష నేతగా ఉండటం కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ఇలా రివర్స్ పంచ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటో పవన్ కే తెలియాలి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.