ఓదార్పు కాదు.. ఓటు యాత్ర!

Publish Date:Nov 5, 2013

Advertisement

 

 

 

వైసీపీ అధినేత జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సీమాంధ్ర ప్రజల బుగ్గలు నిమరడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే జగన్ మళ్ళీ సీమాంధ్ర ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ తర్వాత ఓదార్పు యాత్రకి సంబంధించిన షెడ్యూలు ఖరారు చేసే అవకాశం వుంది.

 

తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాలుగేళ్ళ క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త విని గుండెలు ఆగిపోయి, ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారి కుటుంబాలను ఓదార్చే కార్యక్రమాన్ని జగన్ కొనసాగించబోతున్నాడట. పదహారు నెలల క్రితం అరెస్ట్ అయిన సమయంలో కూడా జగన్ ఓదార్పు యాత్రలోనే వున్నాడు.  ‘ఓదార్పు’ అనే మాటను తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసుకున్న జగన్ ఈసారి చేపట్టాలని అనుకుంటున్న ఓదార్పు యాత్ర ఆయన వేస్తున్న మరో రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. జనరల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో జగన్ చేపట్టబోతున్న యాత్ర 'ఓదార్పు యాత్ర' పేరుతో జరిగే 'ఓటు యాత్ర' అని అభివర్ణిస్తున్నారు.
మొదట విభజన వాదం, ఆ తర్వాత సమన్యాయ వాదం, ఇప్పుడు సమైక్య వాదాన్ని భుజానికి ఎత్తుకున్న వైసీపీ సీమాంధ్రలో తన పట్టున పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ యాత్రని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. అసలే రాష్ట్రం విభజనకు గురవుతోందన్న బాధలో వున్న సీమాంధ్ర ప్రజలను జగన్ ఓదార్పు యాత్ర ఓదార్చే విషయం అటుంచి, మరింత బాధపెట్టే అవకాశం వుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్న పరిస్థితుల్లో జగన్ ఓదార్పు యాత్రను చేపట్టడం ఆయనకి ప్రజల్లో మద్దతు పెంచే విషయం అటుంచి,  సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.వైసీపీ శ్రేణుల్లో కూడా జగన్ ఇప్పుడు సీమాంధ్రలో పర్యటించి రాజకీయ లబ్ధి పొందదలచుకుంటే సమైక్యం పేరుతోనే యాత్రలు చేస్తే మంచిదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓదార్పు యాత్ర చేపడటం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని భయపడుతున్నారు. అయితే మాట తప్పని, మడమ తిప్పని జగన్ మహాశయుడు తన మనసు మార్చకుంటారో, తాను అనుకున్నట్టుగానే ఓదార్పు యాత్ర చేపడతారో చూడాలి.

By
en-us Political News