జనం కోసమే జీవిస్తున్న జగనన్ననే అనుమానిస్తే ఎలా?

 

ఏమిటో...ఈ పాడు లోకం ఎప్పుడూ మంచి వాళ్ళనే అనుమానిస్తుంటుంది. నీతి నిజాయితీ, మడమ తిప్పని గుణం, ఇచ్చిన మాట కోసం ఎన్ని లక్షల మందినయినా ఓదార్చే ఓర్పు, నేర్పు అన్నీ ఉన్నా కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని జనాలు ఇంకా అనుమానిస్తూనే ఉంటారు. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాప్రభుత్వంతో చెడుగుడు ఆడేసుకొంటుంటే మధ్యలో దూరడం భావ్యం కాదు కనుక ఆయన దూరంగా కూర్చొని చూస్తుంటే, దానికి జనాలు తప్పు పడతారు. ఆంద్ర ప్రయోజనాలు కాపడవలసింది పోయి ఆంధ్రాలో తెరాస ఏజంటుగా వ్యవహరిస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటారు. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడటం లేదని ఆయనని ఆడిపోసుకొన్న వాళ్ళే, ఆయన రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని అడిగేందుకు డిల్లీ వెళ్లి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిస్తే అనుమానంగా చూస్తూ ‘సీబీఐ కేసులు మాఫీ చేయించుకోవడానికే వెళ్ళేరేమో...ఏమో ఎవరికీ తెలుసు? అంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల కోసమే కేటాయించిన ఆయన సున్నితమయిన మనసుని కుళ్ళబొడిచేసి ఆనందిస్తుంటారు.

 

పోనీ డిల్లీ వెళ్ళకుండా పక్కనే ఉన్న తుళ్ళూరు వెళ్ళినా రాజధాని కట్టనీయకుండా సైంధవుడిలా అడ్డుతగులుతున్నాడు” అని ఆక్షేపిస్తారు జనాలు. కేంద్రం రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదు? పోలవరం కోసం, రాజధాని కోసం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అని రాష్ట్రంలో జనాలు అందరూ గగ్గోలు పెట్టేస్తుంటే ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ జనాలు ఆయనను ప్రశ్నించడం మరీ అన్యాయం. ఎందుకంటే ఆయన ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి రాలేదు. ఏదోలాగ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకే జగన్ రాజకీయాలలోకి వచ్చిన సంగతి మరిచిపోయి, ఇలా మరొకరు చేయవలసిన పనిని ఆయనని చేయమనడం ఏమి బావుంది? ప్రశించడం కోసం వేరే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకు అధికారం అక్కరలేదు. అతనిని వదిలిపెట్టి మళ్ళీ రాష్ట్రానికి స్వర్ణ యుగం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకొన్న వ్యక్తిని పట్టుకొని జనాలు ఇలా ప్రశ్నించడం ఏమీ బాలేదు.

 

ఏ రాజకీయ నాయకుడయినా ఏ అంశంపైనైనా స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయాడంటే అది కూడా వ్యూహాత్మకమేనని కొత్త సూత్రం కనుగొన్న తరువాత కూడా ఇలా జనాలు అపార్ధం చేసేసుకోనవసరం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతోందని అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ జగన్ సైలంట్ గా ఉండిపోతే దానినీ సీబీఐ కేసులకి లింక్ పెట్టేయడమేనా? ఎంత అన్యాయం? అయినా ఇప్పుడు మౌనంగా ఉండిపోయినంత మాత్రాన్న సీబీఐ కేసులు మాఫీ అయిపోతాయా...? అని కూడా ఆలోచించకుండా జనాలు నోటికి వచ్చినట్లు ఏవేవో చెప్పేసుకొంటుంటారు. ఈరోజు కాకపోతే రేపయినా బీజేపీతో జత కట్టేందుకే జగన్ బాబు వ్యూహాత్మకంగా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడంటూ జనాలు తమ రాజకీయ పరిజ్ఞానం ప్రదర్శించేసుకొంటుంటే పాపం జగన్ మాత్రం ఏమి చేయగలడు?

 

డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిస్తే ఒక తప్పు. కేంద్రాన్ని ప్రశ్నించకపోతే మరో తప్పు అంటే ఇంకా ఎలాగా బ్రతాకాలి? మంచి వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయి. నీతి నిజాయితీని నమ్ముకొన్నవాళ్ళకే ఈ నీలాపనిందలు భరించవలసివస్తుంది. మడమ తిప్పలేని వాళ్ళకే ఆ నొప్పి ఏమిటో తెలుస్తుంది...కానీ జనాలకి ఇవేమీ అర్ధం కావు. కనుక ముఖ్యమంత్రి అయ్యే వరకు మౌనంగా భరించక తప్పదు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు? అనే ప్రశ్నకు ఆయనే జోస్యం చెప్పాలి. ఎందుకంటే అందులో ఆయనకు ఆయనే సాటి.

 

కానీ ఇంతకు ముందు ఎన్నికలలో చెప్పుకొన్న జోస్యాలేవే ఎందుకో ఫలించలేదు. ఎందుకేమిటి...తను నీతి నిజాయితీకి కట్టుబడిపోవడం వలననే ఓడిపోయాడు...లేకపోతేనా...అప్పుడు ఎన్నికల హడావుడిలో ఏవో తప్పు లెక్కలు కట్టుకోవడం వలన జోస్యం ఫలించలేదేమో గానీ ఇప్పుడు మరే పని లేదు కనుక ఈసారి చెపుతున్న జోస్యం ఫలిస్తుందని జగన్ తన చిలక సాక్షిగా చెపుతున్నాడు. కానీ ఇప్పుడు కూడా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలిపోతుందో జోస్యం చెప్పగలుగుతున్నాడు గానీ తను ఎప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడో, తన భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు పాపం.