TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్ళీ ఓదార్పు యాత్రలకి జగన్ సిద్దం?

Published on: Thu Feb 5, 2015 10:27AM

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరో ఓదార్పు యాత్రకి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయన ఈనెల 11వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు బయలుదేరుతున్నట్లు వైకాపా చెపుతోంది. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైకాపా వాదిస్తోంది. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు కనుక జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించి వారికి కొంత ఆర్ధిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం.

 

ఆయన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన నాటి నుండి తన పార్టీని బలపరుచుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా నుండి బయటపడిన వైకాపా మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టేందుకు కూడా ఓదార్పుయాత్రలనే సురక్షితమయిన మార్గంగా ఎంచుకొంది. కానీ అక్కడ అధికారంలో ఉన్న తెరాసతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేకనో లేకపోతే తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేయలేకనో ఆయన స్వయంగా తెలంగాణాలో పర్యటించకుండా తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రల పేరిట పంపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రైతు కుటుంబాలను ఓదార్చే మిషతో యాత్రలకు ఎందుకు బయలుదేరుతున్నారంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకేనని చెప్పవచ్చును. కానీ ఇటువంటి డొంకతిరుగుడు ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవడం సాధ్యం కాదని రెండు రాష్ట్రాలలో ప్రజలు స్పష్టంగా తెలియజేసారు. కానీ జగన్ తన ఓటమి నుండి ఎటువంటి గుణపాటం నేర్చుకోకుండా పాత పద్దతులలోనే ముందుకు సాగాలనుకోవడం విశేషమే.