వైకాపాకు జగనే బ్రాండ్ అంబాసిడర్, శత్రువు కూడా?

 

వై.య.స్సార్. కాంగ్రెస్ పార్టీకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే బ్రాండ్ అంబాసడర్ అని చెప్పవచ్చును. కానీ ఆ పార్టీకి ఆయనే ప్రధాన శత్రువని కూడా చెప్పవచ్చును. ఆయన అహం మరియు దుందుడుకు స్వభావం వల్ల పార్టీకి తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమ మాటకు వీసమెత్తు విలువీయడని, పార్టీలో తమకు ఏ మాత్రం గౌరవం లేదని అందుకే వీడుతున్నామని చెప్పడం గమనిస్తే ఆ పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధమవుతుంది.

 

ఇంతవరకు చాలామంది కేవలం ఇదే కారణంతో పార్టీని వీడారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా ఇదే కారణంతో పార్టీని వీడేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు. ఆ పదవికి రాజీనామా చేస్తూ జగన్ కి వ్రాసిన లేఖలో పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేనని తెలిపినట్లు తాజా సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి అండగా నిలబడిన తమను కాదని తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధి దాడి వీరభద్రరావుని పార్టీలో చేర్చుకొన్నప్పటికీ, ఎన్నికలలో పార్టీ ఓడిపోగానే దాడి కూడా ‘పార్టీలో సీనియర్ల మాటకు విలువలేదు వారికి పార్టీలో గౌరవం లేదు,’ అని ఆరోపిస్తూ పార్టీని వీడారు. కానీ కొణతాల వర్గీయులు మాత్రం స్వర్గీయ వై.యస్సార్ పై అభిమానంతో నేటికీ వైకాపాలోనే కొనసాగుతున్నారు. అదే వారి విశ్వసనీయతకు ఒక మంచి నిదర్శనం. కానీ జగన్మోహన్ రెడ్డి వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గత ఆరునెలలుగా ఆయన, ఆయన సోదరుడు, వారి సహచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ వారిని జగన్ పట్టించు కోకపోవడంతో ఆయన వైఖరితో విసుగెత్తిన కొణతాల వర్గీయులు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం.

 

అసలు జగన్ తన మాటను కాదని తన రాజకీయ ప్రత్యర్ధి దాడి వీరభద్ర రావును పార్టీలో చేర్చుకొన్నప్పుడే ఆయన పార్టీని వీడాలనుకొన్నారు. అపార రాజకీయానుభవం, మంచి ప్రజాధారణ గల ఆయనను చేర్చుకోవడానికి కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకవేళ ఆయన పార్టీని వీడితే ప్రస్తుతం తెదేపా అధికారంలో ఉంది కనుక ఆ పార్టీలో చేరేందుకే ఆసక్తి చూపుతారేమో. ఏమయినప్పటికీ వైకాపా అటు దాడి వీరభద్ర రావును నిలుపుకోలేకపోయింది. పార్టీకి అత్యంత నమ్మకస్తుడని పేరుపడ్డ కొణతాలనూ నిలుపుకోలేకపోతోంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే ఇటువంటి పరిస్థితి తరచూ తలెత్తుతుండటం గమనిస్తే పార్టీకి ప్రధమ శత్రువు పార్టీ అధ్యక్షుడేనని భావించవలసి వస్తోంది.