ఆ దూకుడే కొంప ముంచుతోంది

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చాలా ధాటిగా మాట్లాడుతుండవచ్చు గాక. కానీ తన పార్టీ సభ్యులెవరూ మాట్లాడేందుకు అవకాశం ఈయకుండా సభలో నేనొక్కడినే టైపులో మాట్లాడేస్తుండటంతో, స్వంత పార్టీ సభ్యులందరూ ఆయన ప్రతీ మాటకి బల్లలు చరుచుకోవడానికే పరిమితమయిపోతున్నారు. తన వెనక తన సైన్యం ఫాలో అవుతోందో లేదో కూడా చూసుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని, తెదేపా సభ్యులను ఇరుకున పెట్టాలని ప్రయత్నించబోయి ప్రతీసారి తనే ఇరుకున పడుతున్నారు. అప్పుడు వైకాపా సభ్యులు అందరూ లేచి నినాదాలు చేస్తూ, సభలో మైకులు విరిచేస్తూ సభలో గందరగోళం సృష్టించి ఆయనను తెదేపా సభ్యుల బారి నుండి తమ అధినేతను కాపాడుకోవలసి వస్తోంది. ఆ తరువాత షరా మామూలుగానే ఆయన తనను అధికార పార్టీ వారు 18 సార్లు తిట్టారని, 17సార్లు తన ప్రసంగానికి అడ్డుపడ్డారని, 17సార్లు స్పీకర్ తన మైక్ కట్ చేసారని గణాంకాలు ప్రకటిస్తుంటారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాసం పెడతామని హూంకరిస్తుంటారు కూడా. ఈరోజు కూడా సభనుండి బయటపడిన తరువాత గణాంకాల ప్రకటన పూర్తయిన తరువాత, స్పీకర్ కు మరో లాస్ట్ వార్నింగ్ జారీ చేసారు. ఆయన తన తీరు మార్చుకోకుంటే, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు.

 

ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు చూసిన వారు, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. సభలో ప్రతిపక్షాలు ఎంతగా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వై.యస్స్.రాజశేఖర్ రెడ్డి ఎల్లపుడు చాలా ప్రశాంతంగా నవ్వుతూ సభా కార్యక్రమాలను కూడా మనసారా ఆనందిస్తున్నట్లు వ్యవహరించేవారు. ఆయన అధికార పార్టీలో ఉన్నందున ప్రతిపక్షాలు నిత్యం చాలా ఘాటుగా విమర్శలు గుప్పిస్తుండేవి. వాటిని ఆయన చాలా కులాసాగా నవ్వుతూ అంతే సమర్ధంగా త్రిప్పికొట్టేవారు తప్ప ఏనాడూ కూడా జగన్మోహన్ రెడ్డిలాగ సభలో ఆవేశంతో ఊగిపోయిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ఊరికే ఆవేశాపడిపోతుంటే, అధికార పార్టీ సభ్యులందరూ కలిసి ఆయననే ఇరుకున పెట్టి వినోదిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులెవరికీ సభలో మాట్లాడే అవకాశం ఈయకుండా ఎప్పుడూ తానొక్కడే మాట్లాడేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని తాపత్రయం పడటమేనని చెప్పవచ్చును.

 

కానీ అధికార పార్టీ వైపు చంద్రబాబు తక్కువగా మాట్లాడుతూ తన పార్టీ సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుండటంతో, తెదేపా సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డిపై తలోవైపు నుండి ఆరోపణలు చేస్తూ, విమర్శలు గుప్పిస్తూ, కవ్విస్తూ సహనం కోల్పోయేలా చేస్తున్నారు. ఇది గ్రహించలేని జగన్మోహన్ రెడ్డి నేనొక్కడినే అన్నట్లుగా చాలా దూకుడు ప్రదర్శిస్తూ పదేపదే భంగ పడుతున్నారు. అంతే కాదు సభలో అధికార పార్టీని సమర్ధంగా నిలదీయలేక భంగపడి బయటకొచ్చిమీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకోవడం ద్వారా ప్రజల దృష్టిలోకూడా మరింత చులక అవుతున్నారు.