జగన్ ద్వంద వైఖరి

 

రాష్ట్ర విభజన అనివార్యమని దృడంగా నమ్మినందునే వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రలోకి జంప్ అయింది. అందుకే తనకు నమ్మిన బంటులయిన కొండా సురేఖ వంటి నేతలను సైతం వదులుకోవడానికి ఆ పార్టీ వెనకాడలేదు. అయితే సమైక్యాంధ్ర సెంటిమెంటుతో వైకాపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని వస్తున్నఆరోపణలను ఎదుర్కోవడానికో లేకపోతే తెదేపాను చూసో జగన్ మళ్ళీ తెలంగాణా నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అంటే వైకాపా తెలంగాణాను వదిలిపెట్టేయలేదని, ఎన్నికలలో కూడా పోటీ చేస్తుందని ఆయన సంకేతాలు పంపారనుకోవాలి.

 

కానీ అదే సమయంలో సీమాంధ్రలో తనకున్న బలాన్ని ప్రదర్శించడానికి హైదరాబాదులో భారీ సభ నిర్వహించి తాను తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పారు. అంతే గాక సీమాంధ్రలో తమ పార్టీ అన్నియంపీ సీట్లను కైవసం చేసుకొని డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించారు కూడా. ఆ బహిరంగ సభ ద్వారా తన బలం ప్రదర్శించుకొన్నతరువాతనే అతను ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులని కలవడం చూస్తే, అతని రాజకీయ ఉద్దేశ్యాలు స్పష్టం అవుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలతో పరిచయాలు పెంచుకోవడం అతని ప్రధాన ఉద్దేశ్యం అయితే, సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఏకైక చాంపియన్ గా తనని తను ప్రమోట్ చేసుకోవడం రెండో ఉద్దేశ్యం.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకోవడానికి తను చేస్తున్న ప్రయత్నాల వల్ల తమ పార్టీ తెలంగాణాలో అడుగుపెట్టే అవకాశం శాశ్వితంగా కోల్పోతుందని జగన్ నమ్ముతున్నపటికీ, అతను ఈవిధంగా వ్యవహరించడం చూస్తే, అతనికి ఇక తెలంగాణాపట్ల ఎటువంటి ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది. మరి తెలంగాణా నేతల సంగతి? వారికి కూడా కొండా సురేఖ గతే పట్టిస్తారా?

 

రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని జగన్ మనస్పూర్తిగా నమ్ముతున్నపటికీ, ఉత్తుత్తి ప్రయత్నాలు చేస్తూ సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవడానికే ప్రయత్నిస్తునారని స్పష్టం అవుతోంది. నీతి, నిజాయితీలకు, విశ్వసనీయతకి తనకే పేటెంట్ హక్కులున్నాయన్నట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా అటు తన తెలంగాణా పార్టీ నేతలని, ఇటు సీమాంధ్ర ప్రజలని కూడా మభ్యపెట్టి  చివరికి ఏమి సాధిస్తారో ఆయనకే తెలియాలి.