జగన్ సభకు కిరణ్ గండి కొట్టారా

 

సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ రేసులో కిరణ్, జగన్ ల మధ్య తీవ్ర పోటీ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాంపియన్ షిప్ కోసం జగన్ అష్టకష్టాలుపడుతుంటే కిరణ్ మాత్రం సింపుల్ గా వినాయకుడు పార్వతీ పరమేశ్వరులు చుట్టూ మూడు రవుండ్స్ తిరిగేసి కుమారస్వామిని ఓడించేసినట్లు, ఒంటి మీద ఖద్దరు చొక్కా మడత నలగకుండా, మీడియాను తన ఏసీ గదికే పిలిపించుకొని అమావాస్యకి పున్నానికి అధిష్టానానికి వ్యతిరేఖంగా మూడు ముక్కలు మాట్లాడేసి రేసుగుర్రంలా దూసుకెల్తున్నారు.

 

ఇంత కాలంగా ఉద్యోగులను సమ్మెలు, ప్రజలను ఉద్యమాలు చేసుకోనిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వారిని దువ్వడం చూసి, వెంటనే అప్రమత్తమయి ఉద్యోగులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభకి కోర్టు అనుమతి కూడా ఇచ్చేయడంతో, ఉద్యోగులతో చర్చించి వారిచే సమ్మె విరమింపజేయడం ద్వారా అతని సభను చెవిటి వాడి ముందు శంఖారావంగా మార్చేసారు. ఉద్యోగులు ప్రజలు సమ్మెలు ఉద్యమాలు చేస్తున్నపుడే ఇటువంటి సమైక్య సభలకి ప్రాముఖ్యత ఉంటుంది గానీ, అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉన్నపుడు చేయడం వలన వైకాపాకు శ్రమ, ఖర్చు తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును.

 

బహుశః ఇది గ్రహించినందునేనేమో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు మన ఉద్యోగుల సమ్మెను ఆసక్తిగా చూస్తున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను బెదిరించొ బయపెట్టో వారిచేత ఆకస్మాత్తుగ్గా సమ్మె విరమింపజేసారని ఆవేదన వ్యక్తం చేసారు. పాపం అతని ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. అదేవిధంగా  కిరణ్ కుమార్ రెడ్డి చూపిన టైం సెన్స్ (టైమింగ్) ను కూడా మెచ్చుకోవలసిందే.