కేసీఆర్ బాటలో జగన్మోహన్ రెడ్డి

 

జగన్ జైలు నుండి విడుదలయిన నాటి నుండి, అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత తన భుజాలపై వేసుకొని, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను తన వెనుక నడువమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవసరమయితే వారు తమ పార్టీ జండాలు పట్టుకొని మరీ తన వెనుక నడువవచ్చనే ఒక ఆప్షన్ కూడా వారికిచ్చిఆయన తన ఉదారతను చాటుకొన్నారు.

 

జగన్ జైలు నుండి విడుదల అయినప్పటి నుండి కూడా తను అందరికంటే ఒక గొప్ప సమైక్యవాదిననే అభిప్రాయం ప్రజలలో కలిగించేవిధంగా మాట్లాడుతూ, వ్యూహాలు పన్నుతున్నారు. పైకి ఆయన సమైక్యాంధ్ర కోసం ఎంతో పరితపిస్తున్నట్లు కనిపించవచ్చును. కానీ ఆయన ప్రతీ మాట, వ్యూహం వెనుక సీమంద్రాలో తన పార్టీని బలపరచుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే తపన, తెదేపాను రాజకీయంగా దెబ్బతీయాలనే కసి దాగి ఉన్నాయని చెప్పక తప్పదు.

 

ఇక తాను, తన పార్టీ తప్ప మిగిలిన రాజకీయ నేతలు పార్టీలు అందరూ ద్రోహులే అన్నట్లుగా మాట్లాడుతున్న ఆయన తీరుగమనిస్తే, ఆయనలో కూడా కేసీఆర్ లక్షణాలే స్పష్టంగా కనిపిస్తాయి. కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటుతో ప్రజలను ఏవిధంగా ఆకట్టుకొన్నాడో, అదేవిధంగా ఇప్పుడు జగన్ కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఏవిధంగా తెలంగాణా అంశంపై కేవలం తనకు, తన పార్టీకే పేటెంట్ హక్కులున్నట్లు మాట్లాడుతాడో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ప్రత్యర్ధులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడో, జగన్ కూడా ఇప్పుడు సరిగా అదేవిధంగా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో తెదేపాను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు.

 

ఇది వరకు కేసీఆర్ కూడా తరచు తను రాజీనామాలు చేస్తూ, తన అనుచరులచేత రాజీనామాలు చేయిస్తూ ప్రజలలో ఎప్పటికప్పుడు తన రేటింగ్ నిలకడగా ఉంచుకొనే ప్రయత్నం చేసినట్లే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో యావత్ తెలంగాణా ప్రజలను, రాజకీయ పార్టీలను చివరికే కేంద్రాన్ని కూడా ఏవిధంగా తన ముందు మోకరింప జేసుకోన్నాడో నేడు జగన్ కూడా తన ఆమరణ నిరాహార దీక్షతో అదే ఫలం ఆశిస్తున్నాడు.కేసీఆర్ ఎంతో విజయవంతంగా అమలుచేసిన వ్యూహాలనే జగన్మోహన్ రెడ్డి కూడా నేడు అనుకరిస్తూ సీమంద్రాలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలపై రాజకీయంగా పైచేయి సాధించాలని తపిస్తున్నారు.

 

కానీ ఆంధ్రా కేసీఆర్ కావాలనుకొంటున్నజగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విడదీసేందుకు సర్వం సిద్దం చేసిన ఈ తరుణంలో తన వ్యూహాలతో రాష్ట్రం విడిపోకుండా ఆపలేకపోవచ్చునేమో కానీ సీమంద్రాలో నిలద్రొక్కుకొనే అవకాశం మాత్రం చాలా ఉంది.