జగన్ బెయిలు పిటిషను విచారణ వాయిదా

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నసీబీఐ కోర్టులో పెట్టుకొన్నబెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేయడానికి 5రోజులు గడువు కావాలని సిబిఐ న్యాయవాది కోరడంతో, ఈ కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి సరిగ్గా బెయిలు పిటిషను వేసే సమయానికి ఇంతవరకు అతని కేసులు చూస్తున్న సీబీఐ ఎస్.పి.వెంకటేష్ కేరళకు బదిలీ కావడం అతని స్థానంలోకి చంద్రశేఖర్ అనే కొత్త అధికారి రావడం విశేషం. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఆఖరి చార్జ్ షీట్ కూడా వేసిన తరువాతనే ప్రస్తుత ఎస్.పి.వెంకటేష్ బదిలీపై వెళ్లబోతున్నట్లు సమాచారం.

 

ఇక మొన్నతాజాగా సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్ షీట్లలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల పేర్లు లేకపోవడంతో తెదేపా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మారబోయే రాజకీయ సమీకరణాలకు ఇది కాంగ్రెస్ చేస్తున్న సన్నాహమని తెదేపా భావిస్తోంది. విజయమ్మ డిల్లీ యాత్ర తరువాతనే ఈ మార్పులు మొదలవడాన్నిఅందుకు కారణంగా పేర్కొంటోంది.

 

తెదేపా వాదనలు నిజమయితే త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదల కావడం ఖాయమని చెప్పవచ్చును. ఏది ఏమయినప్పటికీ మరో ఐదు రోజులలో ఏ సంగతీ తెలిసిపోయే అవకాశం ఉంది. తెదేపా చేస్తున్నఈ తీవ్ర ఆరోపణల నేపద్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా సీబీఐ అడ్డుపడినా పడవచ్చును.