జగన్, విజయమ్మల రాజీనామాలు పార్టీకి లాభమా, నష్టమా

 

జగన్, విజయమ్మల రాజీనామాలతో వైకాపా చాలా తెలివిగా పావులు కదిపిందని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. తమ రాజీనామాలతో తమ ప్రియతమ శత్రువు చంద్రబాబుని, అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడి సీమంద్రాలో ఒక్కసారిగా తన రేటింగ్ పెంచుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైకాపా అధిగమించిందని విశ్లేషణ. అయితే, వారు తమ వద్ద ఉంచుకొన్నఆఖరి అస్త్రాలను కూడా ఒక చిన్న ప్రయోజనం ఆశించి నిరుపయోగపరుచుకొన్నారని చెప్పక తప్పదు. షర్మిల పాదయాత్ర కూడా ముగించుకొని వచ్చేసారు గనుక, 'సమైక్య చాంపియన్ షిప్ కోసం జరుగుతున్నరేసులో' ఆమెచేత సభలు, దీక్షలు, ర్యాలీలు నిర్వహింపజేసినా వైకాపాకి అదే ఫలితం వచ్చి ఉండేది. కానీ, జగన్ మోహన్ రెడ్డి చాలా అనాలోచితంగా, దూకుడుగా రాజీనామాలు సమర్పించడం వలన, ఇక ఆ పార్టీ నేతలెవరూ కూడా చట్టసభలలో ప్రవేశించే అవకాశం పోగొట్టుకొన్నారు.

 

ఇంకా సాధారణ ఎన్నికలకి దాదాపు 7-8నెలలు సమయమున్న ఈ తరుణంలో పార్టీకి చెందిన అందరూ రాజీనామాలు చేసి చట్ట సభలలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకోవడం ఒక అనాలోచిత నిర్ణయమని చెప్పక తప్పదు. ఒక వేళ రాష్ట్ర విభజనపై తీర్మానం చేసేందుకు రేపు రాష్ట్ర శాసనసభను నిర్వహిస్తే, మిగిలిన అన్నిపార్టీలు సభలో తమ వాదనలు వినిపిస్తుంటే, వైకాపా మాత్రం అసెంబ్లీ బయట కూర్చొని ధర్నాలు దీక్షలు చేసుకొంటూ కాలక్షేపం చేసుకోవలసి ఉంటుంది.