TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ లండన్ పర్యటన రద్దు..చలో ఢిల్లీ..?

Published on: Tue Apr 18, 2023 9:53AM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం,   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముఖ్య నేతలతో భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు వ్యవహారంలో   సీఎం జగన్ రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే జగన్ లండన్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి ఈ నెల చివరి వారంలో తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ దంపతులు వారం రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ వేగం పెంచడం ఆ పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.  కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లే సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందు కోసమే  లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారంటున్నారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యే ముందు వరకు కూడా నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కీలకమైన ఈ భేటీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందే సీఎం జగన్ అనంతపురం పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

భాస్కరరెడ్డి అరెస్టు నేపథ్యంలో సోమవారం అధికారిక కార్యక్రమాలను కూడా సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. కేసు వ్యవహారంపైనే ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో చర్చించినట్లు చెబుతున్నారు.  కోర్టులపై అపారమైన నమ్మకం, విశ్వాసం ప్రభుత్వానికి ఉందని, ఈ కేసు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్న విశ్వాశాన్ని కూడా జగన్ వ్యక్తం చేసినట్లు సమాచారం. సీబీఐ కేసు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశం ఇతర పార్టీలన్ని రాజకీయం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, లేని దానిని ఉన్నట్లుగా చిత్రీకరించే పరిస్థితికి దిగజారుతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై ఎవరూ, ఎక్కడా మాట్లాడవద్దని, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పార్టీ కేంద్ర కార్యాలయం  అనుమతి తీసుకుని మాట్లాడాలని, అస్పష్టతతో ఎవరూ మాట్లాడకుండా చూడాలని ముఖ్య నేతలకు జగన్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

భాస్కరరెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఈ సూచన చేశారని చెబుతున్నారు. మెత్తం మీద.. భాస్కర రెడ్డి అరెస్టు, పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లతో జగన్  కంగారుపడుతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక తాను ఇప్పటి వరకూ నమ్ముకున్న ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో  ఏ మెరకు  సహాయ పడతారన్నది ..వేచిచూడాల్సిందే.