బాలయ్యకూ జగనన్న ఇన్విటేషన్!.. అన్‌స్టాపబుల్ డ్రామా!
Published on: Tue Feb 15, 2022 4:05PM
టాలీవుడ్ ప్రముఖులంతా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే వారు.. రప్పించుకునే వారితో జగనన్న ఫుల్ బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో వకీల్ సాబ్ సినిమా నుంచి స్టార్ట్ అయిందీ యవ్వారం. టికెట్ ధరల తగ్గింపుతో.. టాలీవుడ్ పెద్దల తోకలు కట్ చేయాలనేది జగన్ స్కెచ్ అంటున్నారు. పవన్ సినిమా ఎలాగోలా గట్టెక్కడంతో.. ఇక జగనన్న టికెట్ల దెబ్బ మిగతా మూవీలపై పిడుగులా పడింది. అఖండ, పుష్పలు హమ్మయ్యా అని బయటపడ్డాయి. ఇక, అసలైన చిత్రాలు ముందుండటంతో ముసళ్ల పండుగ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాటలు.. భయంతో వణికి పోయాయి. ఆయా సినిమా వాళ్లంతా తాడేపల్లికి క్యూ కట్టేశారు.. అలా వరుస కట్టేలా జగన్నాటకం నడిచింది. పనిలోపనిగా పోసానిని పిలిపించి చిరంజీవిని అవమానించడం.. అలీకి రాజ్యసభ సీటు అంటూ పెద్ద నాటకమే నడుస్తోంది.
మీరు మీరే వెళ్తారా? మిగతా వారిని పిలవరా? అంటూ కొత్తపాట అందుకుంది టాలీవుడ్. దీంతో.. ఇక తప్పేలా లేదనుకున్నారో ఏమో.. మంత్రి పేర్నినాని.. మోహన్‌బాబును కలిసి మీటింగ్ విషయాలు బ్రీఫింగ్ ఇస్తే.. ఇక లేటెస్ట్‌గా మా అధ్యక్షుడు మంచు విష్ణు నేరుగా ప్యాలెస్‌లోకి వెళ్లి తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసొచ్చారు. ఇక్కడా రాచమర్యాదల్లో తేడా స్పష్టంగా కనిపించింది. మొన్న చిరంజీవి అండ్ కో కార్లను గేటు బయటే ఆపేసి.. నడిపించుకుంటూ లోనికి తీసుకెళితే.. తాజాగా మంచు వెహికిల్ డైరెక్ట్‌గా తాడేపల్లి గేట్లు దాటేసి వెళ్లిపోయింది. ఆనాడు చిరు అండ్ టీమ్‌కు లంచ్ కూడా పెట్టకుండా.. ఎండలో ప్రెస్‌మీట్ పెట్టిస్తే.. ఈసారి మంచుకు మంచి విందే ఇచ్చారని తెలుస్తోంది.
అదంతా పక్కనపెడితే.. లేటెస్ట్‌గా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో మిగతా వారంతా ఒక లెక్క.. లెజెండ్ బాలకృష్ణ ఇంకోలెక్క. మరి, బాలయ్య బాబును ఆహ్వానిస్తారా? అనే టాక్ కూడా వచ్చింది. అంతలోనే నటసింహం రియాక్షన్‌తో ఓ న్యూస్ వచ్చింది. ఏపీ సీఎం ను కలవడానికి రమ్మన్నారు.! నేను రానని చెప్పా..!! అని బాలకృష్ణ అన్నారని తెలుస్తోంది. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం ‘అఖండ’ ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని బాలయ్య చెప్పారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన సినిమాలపై ప్రభావం చూపబోవని చెప్పుకొచ్చారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని వెల్లడించారు. రాజకీయంగా అయితే హిందూపురం కోసం జగన్‌ని కలుస్తా.. కానీ టికెట్స్ రేట్స్ మీద అయితే కలవను అని చెప్పారు బాలకృష్ణ.
అవునా, మా బాలయ్య బాబుకు జగనన్న నుంచి ఇన్విటేషన్ వచ్చిందా? తాడేపల్లి ప్యాలెస్‌కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను ఆహ్వానించారా? అంటూ బాలయ్య ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే, న్యూస్ అయితే వినిపిస్తోంది కానీ, ఎక్కడా కన్ఫర్మేషన్ మాత్రం లేదు. జగన్‌రెడ్డి అప్పట్లో బాలకృష్ణకు వీరాభిమానని.. కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం.. సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా బాలయ్య కటౌట్‌పై జగనన్న ఫోటో ఉండటం.. గుర్తు చేసుకుంటున్నారు.
అదంతా సరేకానీ.. ఇప్పుడు కూడా నిజంగా జగన్‌రెడ్డి బాలకృష్ణను ఇన్‌వైట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబుకు వియ్యంకుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను.. టికెట్ ధరల అంశంపై చర్చించడానికి తాడేపల్లికి పిలిచారంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. వారం క్రితం కూడా చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ సైతం సీఎం జగన్‌ను కలుస్తారంటూ ప్రచారం చేశారు. ఓ రోజుంతా ఆ న్యూస్‌ను తెగ వైరల్ చేశారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడుకూడా అప్పటిలానే బాలయ్య బాబును పిలిచారంటూ వైసీపీ సోషల్ మీడియా గ్రూపులే ప్రచారం చేస్తున్నాయేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలకృష్ణ చేశారంటూ చెబుతున్న వ్యాఖ్యలు సైతం జగన్‌కు ఫేవర్‌గా ఉండటం మరో డౌట్. టికెట్ ధరలు తక్కువగా ఉన్నా తన సినిమా నడిచిందని.. టికెట్ ధరలు తన సినిమాలపై ప్రభావం చూపబోవని.. తన సినిమాల బడ్జెట్‌ను తాను పెంచనని.. బాలకృష్ణ అన్నారంటూ వార్తలు రావడం సైతం అందులో భాగమేనా? అని అనుమానిస్తున్నారు.


