కాంగ్రెస్ ని చూసి జగన్ నేర్చుకుంటారా..?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేక పార్టీలను కలుపుకొని పోవడంలో విఫలమవుతుందా? అంటే ఇంచుమించు అందరూ అవుననే అభిప్రాయమే వ్యక్తం చేస్తారు.. అభిప్రాయం కాదు అదే వాస్తవం కూడా.. కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతుంది.. అవసరమైతే ప్రధాని కుర్చీని మిత్రపక్షాలకు త్యాగం చేసేందుకు కూడా సిద్ధం అంటోంది.. ఇప్పటికే ఇలాంటి త్యాగం కర్ణాటకలో చేసింది కూడా.. కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం తక్కువ సీట్లు గెలిచిన కుమార స్వామిని సీఎం చేసింది.

 

 

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చూస్తోంది.. అందుకే కాంగ్రెస్ కి బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక్కోటి దగ్గరవుతున్నాయి.. ఇక ఏపీ విషయానికొస్తే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వడంలో విఫలమవుతుందనే చెప్పాలి.. ఇతర పార్టీలను కలుపుకొనిపోతే క్రెడిట్ ఆ పార్టీలకు పోతుంది అనుకుంటున్నారో ఏమో కానీ, జగన్ ప్రతిసారి టీడీపీని ఒంటరిగానే టార్గెట్ చేస్తున్నారు.. నిరసనలు కూడా ఒంటరిగానే చేస్తున్నారు.. దీని వల్ల అధికార పార్టీతో పాటు, మిగతా విపక్ష పార్టీలు కూడా జగన్ కి దూరమవుతున్నాయి.. అంతెందుకు జగన్ రీసెంట్ గా రాష్ట్ర బంద్ చేసారు.. ఒక్క విపక్ష పార్టీ అయినా బంద్ కి మద్దతు తెలిపిందా?.. లేదు.. దానికి కారణం జగన్ మిగతా పార్టీలను కలుపుకొని పోకపోవడమే.. 2014 ఓటమి నుండి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్ మిగతా పార్టీలను కలుపుకొనిపోతూ పుంజుకుంటుంటే, జగన్ ఇంకా అదే తప్పు చేస్తూ 2014 దగ్గరే ఆగిపోయారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.