జగన్ అభద్రతా భావం....అందుకే విజయసాయి తొలగింపు ?

 

ఏపీ రాజకీయాల్లో ఒక ఘటన ఆసక్తికరంగా మారింది, అదే విజయసాయి రెడ్డి ప్రత్యేక ప్రతినిది హోదా నుండి తొలగింపు. నిజానికి ఇది మామూలుగా అయితే అంత పెద్ద ప్రాముఖ్యత లేని వార్తే అని చెప్పాలి. ఏదో పొరపాటున నియమించారు, ఇప్పుడు రూల్ తెలిసి తప్పించారని సరిపెట్టుకోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి గురించి జరుగుతున్న ప్రచారం మాత్రం అలా సరిపెట్టుకోనివ్వడం లేదు. 

ఎందుకంటే ఇది జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం. వైకాపాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి విజయసాయి, అక్రమాస్తుల కేసులో కలిసి జైలుకి వెళ్లి వచ్చిన నాటి నుండి ఈయనను పార్టీలో నెంబర్ 2 స్థానానికి వచ్చేలా చేశారు జగన్. అసలు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఈయన ఏకంగా ఒక పార్టీలో నెంబర్ 2 అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఆయన చదువు ప్రకారం ఆయన ఒక తెలివయిన వ్యక్తి అయ్యుండచ్చు, కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా జగన్ పుణ్యమా అంటూ ఏకంగా పీఎంవోలో గంటల తరబడి కూర్చునే స్థాయికి వచ్చారు. 

ఆ మహత్యమో ఏమో కానీ 2019 ఎన్నికల్లో అయితే విజయసాయిరెడ్డి లేకుండా ఏ పనీ జరగలేదు. జగన్ ని కూడా అంతగా పట్టించుకోక క్యాడర్ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఎంతో కీలకంగా కనిపించిన ఆయనకు ప్రచారం జరిగినట్టే ప్రాధాన్యత దక్కింది. మొన్నటి విజయం అనంతరం ఏకంగా 5 పదవులు జగన్ ఆయనకు కట్టబెట్టారు. అందులో అత్యంత కీలకమైన, కేబినెట్ ర్యాంకు కలిగిన పోస్టు ‘ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి’ పదవి కూడా ఒకటి. అయితే ఈ పోస్టును రద్దు చేస్తూ నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

దీనికి కారణంగా నిబంధనల పేరు చెబుతున్నారు. ఓ ఎంపి మరో లాభదాయక పదవిలో కొనసాగేందుకు వీలు లేదన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉన్న నిబంధన. ఇదే విషయంలో గతంలో కూడా సోనియా గాంధి వంటి వారి మీద చాలా వివాదాలు రేగాయి. అందుకే తప్పించామని చూచాయగా చెబుతున్నా ఈ కీలకమైన పోస్టును పీకేయడం వెనుక మరో పెద్ద కారణమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో మోడీకి ఏపీ బీజేపీ నేతల కంటే సాయిరెడ్డి ఎక్కువ దగ్గరయ్యాడని విశ్లేషకుల భావన. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు, మోడీ వచ్చి విజయ్ గారూ బాగున్నారా అని అన్నారని, ఇది జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని ఆయన పేర్కొన్నాడు. 

నిజానికి విజయసాయి మీద ఆంధ్రా పళని స్వామి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత పార్టీకి ఎలా హ్యాండ్ ఇచ్చి మోడీతో చేతులు కలిపి సీఎం పీఠాం అనుభవిస్తున్నాడో ఈయన కూడా అదే చేయబోతున్నాడనేది కొందరి వాదన. అదీ కాక ఏపీలో వైసీపీ వారిని చేర్చుకోడానికి బీజేపీ తలుపులు తెరిచింది, ఎటూ జగన్ గెలిచేందుకు మోడీ ఈవీఎంల ద్వారా సాయ పడ్డాడు అనే ప్రచారం ఉండనే ఉంది, ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తప్పించి, విజయసాయి రెడ్డిని బీజేపీ సీఎం చేసినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల మధ్య సాయిరెడ్డిని తప్పించడం ఏపీ రాజకీయల్ల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రచారాల వలన ఏర్పడిన అభద్రతా భావం వలనే జగన్ విజయసాయి రెడ్డిని తప్పించారనేది జరుగుతున్న ప్రచారం. చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో ?