ఖర్చుకు వెనుకాడుతున్న అభ్యర్ధులు
Published on: Thu Mar 8, 2012 9:21AM
హైదరా
బాద్: జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటుపడిన నియోజకవర్గాల్లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే ఎప్పుడూ టిక్కెట్లకోసం క్యూలు కట్టే అభ్యర్ధులు ఈసారి మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి దాదాపు అన్ని పార్టీల్లోనూ నెలకొని ఉంది. జగన్ పార్టీకి చెందిన ఇద్దరు తాజా మాజీలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని సృష్టంచేశారు. మిగిలిన పార్టీలను సరైన అభ్యర్ధి దొరకడం ఒక సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం అభ్యర్ధుల నిరాసక్తతే. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి 7 నుంచి 10 కోట్ల రూపాయలు కనీసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చుచేసి గెలిచినా అసెంబ్లీలో ఉండేది రెండేళ్ళు మాత్రమే. ఈ రెండేళ్ళలో మంత్రి పదవులు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. రెండేళ్ళ తరువాత మళ్ళీ వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఇస్తారో ఇవ్వరోనన్న సందేహం కూడా ఈ అభ్యర్ధుల్లో ఉంది. అందుకే ఈ రెండేళ్ళ భోగానికి కోట్లు ఖర్చు చేయడం దండుగ అనే భావనతో చాలామంది అభ్యర్ధులు ఎన్నికల్లో పోటీచేయడానికి వెనుకాడుతున్నారు. ఫలితంగా అన్ని పార్టీలు అభ్యర్ధులను నిలబెట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.


