విధులకు రాకుంటే క్రిమినల్ కేసు, అరెస్ట్! గ్రామ,వార్డు కార్యదర్శులకు జగన్ సర్కార్ బెదిరింపులు
Published on: Sun Jan 9, 2022 11:49AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఆర్సీ సెగ బాగా తగులుతోంది. మఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన వేతన సవరణ పట్ల మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమంటుండగా, గ్రామ, వార్డ్ కార్యదర్శులు ప్రభుత్వంకు పెద్ద షాక్ ఇచ్చారు. తమ సర్వీసు ప్రొబేషన్‌ను డిక్లేర్ చేసి జీతాలు నిర్ణయించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లోని కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఆందోళనకు దిగారు. వెనువెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి అడ్మిన్‌గా ఉండే గ్రూపుల్లో నుంచి గ్రామ, వార్డు కార్యదర్శులు ఎగ్జిట్ అయ్యారు.
గత ఏడాది ఆగస్టులో ప్రొబేషన్ డిక్లేర్ చేయాల్సి ఉండగా నేటి వరకూ ప్రభుత్వం చేయలేదు. సీఎం జగన్ పీఆర్సీ ప్రకటనలో జూన్ ఆఖరులో చేస్తామని చెప్పడంతో నిరసనకు దిగారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను వేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపిడీవోలకు సమాచారమిచ్చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని రేషన్ కార్డ్‌తోపాటు అనేక సంక్షేమ ఫలాలను వదులుకున్నామని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలే కొత్త జీతాలను తీసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. వెంటనే తమ ప్రొబేషన్‌ను డిక్లేర్ చేసి కొత్త జీతాలు ఇవ్వకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావడంతో ప్రభుత్వ ఆదేశాలు ఎవరికి ఇవ్వాలో అర్ధంకాక ఉన్నతాధికారులు అయోమయం చెందుతున్నారు. గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్న కార్యదర్శులతో వెంటనే మాట్లాడాలని జిల్లా అధికారులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్ ఆదేశించారు. వారికి నచ్చజెప్పాలని, అయినా మాట వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా అధికారులకు ఆయన వాట్సాప్ సందేశం పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆందోళన చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను స్థానిక అధికారులు బెదిరిస్తున్నారు. విశాఖ జిల్లాలోని ఓ తహసీల్దార్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు చేస్తూ తహసీల్దార్ వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం విధులకు హాజరు కాని వారి వివరాలు తెలుసుకోవాలని, వారిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు.
అనంతపురం జిల్లా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి హెచ్చరిక మెసేజ్ చేశారు. నిరసన తెలిపే ఉద్యోగులు ముందుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదన్నారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక జారీ చేశారు. తాము 30 ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏమైనా అడిగేందుకు భయపడుతున్నామని... అలాంటిది నిన్నగాక మొన్న ఉద్యోగాల్లో చేరి అప్పుడే ఆందోళనలు ఏమిటని తహసీల్దార్ ప్రశ్నించారు. అయితే తహశీల్దార్ల హెచ్చరికలపై గ్రామ, వార్డ్ కార్యదర్శులు మండిపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.


