తప్పులో కాలేసిన జగన్ రెడ్డి సర్కార్! తెలంగాణ పంచాయతీ ఫోటోతో యాడ్ 

పంచాయతీ ఎన్నికల విషయంలో పంతానికి పోయి పరువు పోగుట్టుకుంది జగన్ రెడ్డి సర్కార్. చేసిదిలేక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్దమని ప్రకటించింది. ఎన్నికల విషయంలో  వైసీపీకి చుక్కలు చూపించిన నిమ్మగడ్డ... బలవంతంగా  ఏకగ్రీవాలు చేసుకోవాలనే అధికార పార్టీ ఎత్తులకు చెక్ పెట్టారు. ఏకగ్రీవ ఎన్నికలు జరగకుండా చూసేందుకు  ప్రత్యేక అధికారిని నియమించారు. ఎన్నికల విషయంలో ఎస్ఈసీ దగ్గర వరుస ఎదురుదెబ్బలు తిన్న జగన్ రెడ్డి సర్కార్.. మరో ఎత్తు వేసింది. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ వ్యూహానికి గండి కొట్టేలా  ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అత్యుత్సాహంతో అక్కడ తప్పులో కాలేసి నవ్వుల పాలైంది జగన్ రెడ్డి సర్కార్. 

పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలంటూ  పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ  సర్కార్. ఏకగ్రీవ గ్రామాలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతేకాదు ఏకగ్రీవాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం  బుధవారం  అన్ని పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందా అంటూ ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ యాడ్ ఇచ్చింది. అయితే ఈ యాడ్ విషయంలో తప్పులో కాలేసింది జగన్ సర్కార్.

పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం గురించి ఇచ్చిన ప్రకటనలో తెలంగాణకు చెందిన ఓ గ్రామ పంచాయతీ భవనం ఫొటో వేశారు. అందులో తెలంగాణ ప్రభుత్వం లోగో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌పై విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో ఒక్క గ్రామ పంచాయతీ ఫొటో కూడా మీకు దొరకలేదా..? అని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ఫొటోను వేస్తారా? అని ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. నిమ్మగడ్డ ఇచ్చిన షాకులతో షేకైన జగన్ రెడ్డి సర్కార్.. ఏం చేయాలో తెలియక తికమక నిర్ణయాలు తీసుకుంటందనే విమర్శలు వస్తున్నాయి. 

పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది.  2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు నిధులు లభిస్తాయి. 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది.