జగన్ సర్కార్ పతనం ఖాయం.. రైతల పాదయాత్రలో కంఠంనేని రవిశంకర్
Published on: Wed Sep 21, 2022 5:50PM
అమరావతి రైతుల పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. వరుసగా రెండో రోజూ ఆయన అమరావతి రైతులతో అడుగు కలిపి నడిచారు. అమరావతి నినాదంతో దివిసీమ మార్మోగింది. అమరావతి రైతుల మహాపాదయాత్ర పదో రోజు బుధవారం (సెప్టెంబర్21) కృష్ణా జిల్లా చల్ల పల్లి నుంచి చిన్నాపురం వరకూ సాగింది. తెలుగువన్ ఎండీ, తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్ వందలాది మంది మద్దతుదారులతో కలిసి రైతులతో పాటు నడిచారు. చల్లపల్లిలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి పదో రోజు యాత్ర ప్రారంభించిన రైతులకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.
ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర అరసవల్లి చేరేసరికి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకతప్పదని, ఆ తరువాత జగన్ సర్కార్ పతనం కావడం కూడా తథ్యమని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతే జనం మూడు రాజధానులను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారనడానికి తార్కాణమన్నారు. రైతుల పాదయాత్రకు రవిశంకర్ స్వంత నియోజకవర్గమైన అవనిగడ్డలో జనం బ్రహ్మరథం పట్టారు. రైతుల పాదయాత్రకు మద్దతుగా దివి సీమ జనం ఉప్పెనలా కదిలారు. రైతులపై పూల వర్షం కురిపించారు. దీంతో రైతులు నేల మీద కాకుండా పూలపాన్పుపైన నడుస్తున్నారా అనిపించింది.
ఆకుపచ్చ ప్రవాహంలా రైతుల పాదయాత్ర సాగుతుంటే, వారికి మద్దతుగా జనం జై అమరావతి నినాదాలు చేశారు. ఎడ్ల బళ్లకు అమరావతి ప్రభలు కట్టి అమరావతి రైతుల పాదయాత్రకు దివిసీమ వాసులు స్వాగతం పలికారు. జనసేన, కాంగ్రెస్, వామపక్షాల నేతలు కూడా తరలి వచ్చి అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికారు.


